Nara Lokesh: 25 వేల మంది విద్యార్థులతో సూర్యనమస్కారాల ప్రపంచ రికార్డు... ఇది గర్వించాల్సిన రోజన్న మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Praises Students Surya Namaskar World Record
  • విశాఖలో విద్యార్థుల అపూర్వ యోగా ఘట్టం
  • 25 వేల మంది సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డు!
  • గిరిజన విద్యార్థుల ప్రతిభను కొనియాడిన మంత్రి నారా లోకేశ్
  • ప్రధాని మోదీకి కానుకగా గిన్నిస్ రికార్డును అందిస్తామని వెల్లడి
మనమంతా గర్వపడాల్సిన రోజని, యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25 వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్యనమస్కారాలు చేసి చరిత్ర సృష్టించారని ఆయన కొనియాడారు. కూటమి ప్రభుత్వం జూన్ 21న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా, శుక్రవారం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లాకు చెందిన 25 వేల మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించే దిశగా అడుగులు వేశారు.

ఈ రోజు గిరిజన విద్యార్థులను చూస్తుంటే వారి కమిట్‌మెంట్, పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నాయని మంత్రి లోకేశ్ ప్రశంసించారు. 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచిందని, ఒక్క పిలుపుతో వారంతా కష్టపడి దేశంతో పాటు ప్రపంచం మనవైపు చూసేలా చేసినందుకు ప్రభుత్వం తరపున విద్యార్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రాత్మక ప్రదర్శన ఒక ప్రపంచ రికార్డు అని, దీనిని శనివారం అధికారికంగా ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులందరికీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.

విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎన్నడూ జరగని విధంగా నిర్వహించి చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కోరారని, అందుకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని లోకేశ్ గుర్తుచేశారు. శనివారం (జూన్ 21) జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొని మరో గిన్నిస్ రికార్డు సృష్టించబోతున్నారని ఆయన ప్రకటించారు.

యోగా అనేది కేవలం ఆసనాలు కాదని, అది మన జీవన విధానమని, మనందరికీ క్రమశిక్షణ నేర్పుతుందని మంత్రి లోకేశ్ అన్నారు. తాను కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు తన తండ్రి చంద్రబాబు తనతో యోగా చేయించేవారని, ఉదయాన్నే నిద్రలేవడం మొదట్లో కష్టంగా అనిపించినా, ఆయన నేర్పించిన క్రమశిక్షణ, పట్టుదల వల్లే తాను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానని వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. అదే క్రమశిక్షణ, పట్టుదల ఈ విద్యార్థుల్లోనూ ఉందని, దానిని ఎప్పటికీ మరువొద్దని సూచించారు.

ఆంధ్రులుగా మన కోరికలన్నీ ప్రధాని నరేంద్ర మోదీ తీరుస్తున్నారని మంత్రి లోకేశ్ అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపారని, విశాఖకు రైల్వే జోన్ ఇచ్చారని, నిలిచిపోయిన అమరావతి పనులను పునఃప్రారంభించారని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవసరమైన సంస్థలను కేటాయించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అన్నా, విశాఖ అన్నా ప్రధాని మోదీకి చాలా ప్రేమ అని, ఏడాదిలో రెండోసారి ఆయన విశాఖకు వస్తున్నారని గుర్తుచేశారు. ఆయనకు కానుకగా ఈ రోజు విద్యార్థులు సాధించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును అందిస్తున్నామని లోకేశ్ పేర్కొన్నారు.

ఈ విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదల చూస్తుంటే తన కుమారుడు దేవాన్ష్ గుర్తుకువస్తున్నాడని, ఈ లక్షణాలను దేవాన్ష్‌కు కూడా నేర్పించాల్సిన అవసరం ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. 
Nara Lokesh
Andhra Pradesh
Visakhapatnam
Yoga
Surya Namaskar
World Record
Guinness Record
Chandrababu Naidu
Narendra Modi
Tribal Students

More Telugu News