Narendra Modi: 'యోగాంధ్ర'లో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ... స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేశ్

Narendra Modi Arrives in Visakhapatnam for Yoga Andhra Event
  • జూన్ 21న విశాఖలో 'యోగాంధ్ర' కార్యక్రమం
  • పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ
  • మోదీ అంటే మోటివేషన్, డెడికేషన్ అని లోకేశ్ ప్రశంస
  • యోగా నిర్వహణలో ఏపీ రికార్డులు సృష్టిస్తుందని ధీమా
  • విశాఖలో యోగా కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. రేపు (జూన్ 21) నగరంలో నిర్వహించనున్న 'యోగాంధ్ర' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్... ప్రధాని మోదీకి సాదరంగా స్వాగతం పలికారు. 

ప్రధాని మోదీకి స్వాగతం పలికిన విషయాన్ని మంత్రి లోకేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. "యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖ చేరుకున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలికాను" అని వెల్లడించారు. "మోదీ అంటే మోటివేషన్, మోదీ అంటే డెడికేషన్" అని మంత్రి కొనియాడారు. 

అంతేకాకుండా, యోగా కార్యక్రమాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. "యోగా నిర్వహణలో రికార్డులు బద్దలు కొట్టడానికి ఏపీ రెడీ!" అని ఆయన ఉత్సాహంగా ప్రకటించారు. విశాఖలో జరగనున్న 'యోగాంధ్ర' కార్యక్రమం విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని మోదీ రాకతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. 

శనివారం ఉదయం 5.30 గంటల నుంచి యోగాంధ్ర కార్యక్రమం జరగనుంది. విశాఖలో రికార్డు స్థాయిలో జరగన్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఈ మేరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ తదితరులు గత కొన్ని రోజులుగా యోగాంధ్ర ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.
Narendra Modi
Visakhapatnam
Yoga Andhra
Nara Lokesh
International Yoga Day
Andhra Pradesh
Chandrababu Naidu
Ponguru Narayana
Yoga event

More Telugu News