Ana Barbara Buldrini: కాస్మెటిక్ సర్జరీ వికటించి గాయని మృతి

Ana Barbara Buldrini Cosmetic Surgery Turns Fatal in Turkey
  • టర్కీలో కాస్మెటిక్ సర్జరీ వికటించి మొజాంబిక్ గాయని, ఇన్ఫ్లుయెన్సర్ మృతి
  • ఉచితంగాసర్జరీ... అందుకు బదులుగా క్లినిక్ ప్రచారం చేసేందుకు ఒప్పందం
  • ఆపరేషన్ జరిగిన కొన్ని గంటల్లోనే గుండెపోటు
  • షెడ్యూల్ కన్నా ముందే, సరైన జాగ్రత్తలు లేకుండా సర్జరీ చేశారని భర్త ఆరోపణ
  • ఆసుపత్రిపై గతంలోనూ ఆరోపణలు, ఇటీవలే పేరు మార్పు
సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకునేందుకు చేసిన కాస్మెటిక్ సర్జరీ వికటించి, మొజాంబిక్‌కు చెందిన ప్రముఖ గాయని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనా బార్బరా బుల్ద్రిని (31) టర్కీలో మృతి చెందారు. ఇస్తాంబుల్‌లోని టూసా ఆసుపత్రిలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, రొమ్ముల పరిమాణం పెంచే సర్జరీ, లైపోసక్షన్, ముక్కు సర్జరీల కోసం బుల్ద్రిని ఇస్తాంబుల్ వచ్చారు. ఉచితంగా ఈ సర్జరీలు చేసి, అందుకు ప్రతిఫలంగా తమ క్లినిక్‌ను ప్రచారం చేయించుకునేందుకు ఆసుపత్రి యాజమాన్యం ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే, శస్త్రచికిత్స జరిగిన కొన్ని గంటల్లోనే బుల్ద్రినికి గుండెపోటు రావడంతో ఆమె విషాదకరంగా మరణించారు. ప్రాథమిక సంప్రదింపులు జరిపిన కొద్ది రోజులకే, షెడ్యూల్ కంటే ముందే, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, భోజనం చేసిన తర్వాతే సర్జరీ చేశారని ఆమె భర్త, ప్రముఖ కళాకారుడు ఎల్గార్ సుయెయా ఆరోపించారు. తన భార్య మరణంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ టూసా ఆసుపత్రి గతంలోనూ సర్జరీ సంబంధిత మరణాల విషయంలో విమర్శలు ఎదుర్కొందని, ఇటీవలే పేరు మార్చుకుందని సమాచారం. ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం స్పందిస్తూ, పూర్తి చట్టపరమైన, వైద్యపరమైన సమాచారం అందించాకే సర్జరీ చేశామని, కోలుకుంటున్న దశలో "ఊహించని సమస్య" తలెత్తిందని తెలిపింది. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ కారణంగా గుండెపోటు వచ్చిందని, 90 నిమిషాలు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వివరించింది. మరణానికి కచ్చితమైన కారణం నిర్ధారించేందుకు చట్టపరమైన దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది.
Ana Barbara Buldrini
cosmetic surgery
Mozambique singer
social media influencer
Turkey hospital
plastic surgery death
liposuction
Tusa Hospital Istanbul
Elgar Sueyo

More Telugu News