Krishnam Raju: అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసు.. జర్నలిస్ట్ కృష్ణంరాజుపై పోలీసుల ప్రశ్నల వర్షం

Amaravati Case Police Grill Journalist Krishnam Raju on Bank Details
  • అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజు విచారణ
  • బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు రావడంపై పోలీసులు ప్రశ్నలు
  • ‘నాకు తెలియదు, గుర్తులేదు’ అంటూ సమాధానాలు దాటవేస్తున్న నిందితుడు
  • విచారణకు కృష్ణంరాజు సహకరించడం లేదంటున్న పోలీసులు
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా ఆయన బ్యాంకు ఖాతాల్లోకి పలుమార్లు జమ అయిన డబ్బుకు సంబంధించిన వివరాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో ఈ విచారణ జరిగింది.

కృష్ణంరాజు బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలను ఆయన ముందుంచిన పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. ‘మీ బ్యాంకు ఖాతాల్లోకి ఇన్నిసార్లు డబ్బు ఎవరు జమ చేశారు? ఎందుకు చేశారు? అన్ని ఖాతాల నుంచి ఇలా డబ్బు జమ కావడానికి కారణం ఏమిటి? అసలు మీ ఆదాయ మార్గాలు ఏమిటి?’ వంటి ప్రశ్నలతో పోలీసులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. అయితే, ఈ ప్రశ్నలకు కృష్ణంరాజు ‘నాకు తెలియదు, గుర్తులేదు’ అంటూ సమాధానాలు దాటవేసినట్టు తెలిసింది. దాదాపు 40 ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించగా, ఆయన నుంచి సరైన స్పందన రాలేదని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ఎవరి ప్రోద్బలమైనా ఉందా? అటువంటి వ్యాఖ్యలు చేయడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి? అనే కోణంలో కూడా పోలీసులు ప్రశ్నలు అడిగినప్పటికీ, కృష్ణంరాజు విచారణకు పెద్దగా సహకరించలేదని తెలుస్తోంది. ఆయన న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ ప్రక్రియ కొనసాగింది. కృష్ణంరాజును మూడు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో తొలిరోజు విచారణ శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది. నేడు, రేపు కూడా ఆయన్ను విచారించనున్నారు.  
Krishnam Raju
Amaravati
Amaravati women
Journalist Krishnam Raju
Tulluru traffic police station
Bank account transactions
Police custody
Inappropriate comments
Andhra Pradesh
AP News

More Telugu News