Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. బండి సంజయ్ సన్నిహితుడి ఫోన్ కూడా ట్యాప్

- కరీంనగర్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కలకలం
విచారణకు హాజరు కావాలని ప్రవీణ్ రావుకు సిట్ అధికారుల పిలుపు
గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు
డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ తో వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. ఉత్తర తెలంగాణలో కీలకమైన ఈ జిల్లాకు చెందిన పలు పార్టీల ముఖ్య నాయకుల ఫోన్లు గతంలో ట్యాపింగ్‌కు గురయ్యాయన్న వార్తలు ప్రస్తుత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెలుగుచూస్తుండటంతో స్థానిక నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించిన నేపథ్యంలో తాజా పరిణామాలు ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
గత రాత్రి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను సిట్ అధికారులు సంప్రదించి, ఆయన వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి సమయం కోరినట్లు తెలిసింది. ఇదే క్రమంలో ఉదయం కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి ప్రవీణ్‌రావుకు సిట్ అధికారులు ఫోన్ చేసి, ఆయన ఫోన్ గతంలో ట్యాపింగ్‌కు గురైందని, ఈ విషయమై విచారణకు హాజరై వివరాలు అందించాలని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. బండి సంజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రవీణ్‌రావు, చాలాకాలంగా పార్టీ రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ బాధితుల జాబితాలో చేరడంతో, ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు కూడా తమ ఫోన్లు గతంలో ట్యాప్ అయి ఉండవచ్చనే ఆందోళనలో ఉన్నారు.