Pawan Kalyan: అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్‌కు లభించిన గొప్ప గౌరవం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan Hails International Yoga Day as Honor for India
  • విశాఖలో జరుగుతున్న‌ 'యోగాంధ్ర' కార్యక్రమంలో డీప్యూటీ సీఎం ప్రసంగం
  • యోగా ప్రాముఖ్యతను రుగ్వేదం చెప్పిందని.. మోదీ ప్రపంచానికి చాటారని వెల్లడి
  • ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధిస్తామని వ్యాఖ్య
  • సాగర తీరంలో 11వ యోగా దినోత్సవ వేడుకలకు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు 
యోగా అనేది భారతీయులకు దక్కిన అమూల్యమైన గౌరవమని, దీనిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే చెందుతుందని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. సూర్య భగవానునికి, యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, యోగశాస్త్ర రూపంలో మనకందించిన పతంజలి మహర్షికి వందనాలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

భారతీయ సనాతన ధర్మం యొక్క విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన దార్శనికులు ప్రధాని నరేంద్ర మోదీ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారో, ఒత్తిడిని జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారో చెప్పడానికి ప్రధాని మోదీయే నిలువెత్తు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం యావత్ భారత ప్రజలకు, భారతీయులందరికీ దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు.

2014లో ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ యోగా దినోత్సవంపై తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, దాదాపు 177 దేశాలు మద్దతు పలికాయని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. అంతర్జాతీయంగా ఇంతటి మద్దతు కూడగట్టడం వల్లే 2015 నుంచి యోగా దినోత్సవం అధికారికంగా ప్రారంభమైందని తెలిపారు. ఈ ఏడాది విశాఖపట్నం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక కావడం సంతోషకరమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచిందని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.

"వన్ ఎర్త్, వన్ హెల్త్" అనే థీమ్‌ను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. యోగా గొప్పదనాన్ని ఋగ్వేదంలోనే మన మహానుభావులు తెలియజేశారని, దానిని ప్రపంచానికి చాటిచెప్పిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
Pawan Kalyan
International Yoga Day
Yoga Andhra
Visakhapatnam
Andhra Pradesh
Narendra Modi
Chandra Babu Naidu
Yoga Benefits
World Record Yoga

More Telugu News