Ayesha Meera: సంచలనం సృష్టించిన ఆయేషా మీరా కేసులో ముగిసిన సీబీఐ విచారణ

Ayesha Meera Case CBI Investigation Concluded Report Submitted to High Court
  • 2007లో జరిగిన అయేషా మీరా హత్యాచార ఘటన
  • తొలుత సత్యంబాబును దోషిగా తేల్చి శిక్ష విధించిన ట్రయల్ కోర్టు
  • సత్యంబాబును నిర్దోషిగా తేల్చిన హైకోర్టు 
  • హైకోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన సీబీఐ
  • హైకోర్టులో దర్యాప్తు తుది నివేదికను సమర్పించిన సీబీఐ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ ముగిసింది. ఏడు సంవత్సరాలుగా సీబీఐ అధికారులు ఈ కేసు దర్యాప్తును కొనసాగించారు. 2018లో ఈ కేసును పునఃవిచారణ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది.

సిట్ దర్యాప్తులో పురోగతి లేదని హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణను ముగించిన సీబీఐ నిన్న విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు అందజేసింది. అయితే నివేదిక కాపీని సీబీఐ కోర్టులో అందించాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసు విచారణను వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది.

ఆయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేశామని తొలుత సీబీఐ అధికారులు హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తు తుది నివేదిక దాఖలు చేసేందుకు సీబీఐ అధికారులకు కోర్టు అనుమతి ఇవ్వడంతో సీల్డ్ కవర్‌లో నివేదిక కాపీలను సీబీఐ అధికారులు హైకోర్టుకు సమర్పించారు. వాటిని భద్రపరచాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే.. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో గల ఓ హాస్టల్‌లో ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా(17)పై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన 2007 డిసెంబర్ 27న జరగ్గా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో తొలుత ఒక రౌడీ షీటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత నందిగామ సమీపంలోని అనాసాగరంకు చెందిన సత్యంబాబు అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించి అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఈ కేసులో ట్రయల్ కోర్టు సత్యంబాబును దోషిగా తేల్చి జైలు శిక్షను విధించింది. సత్యంబాబును బలిపశువు చేశారని, అసలైన దోషులను విచారించి అరెస్టు చేయలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో సత్యంబాబు జైలు శిక్ష అనుభవిస్తూనే హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు విచారణ జరిపి సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో అతను జైలు నుంచి విడుదలయ్యాడు.

అయేషా మీరా తల్లిదండ్రులు ఈ కేసులో అసలైన దోషులను పట్టుకుని శిక్షించేందుకు సీబీఐ దర్యాప్తు చేయాలని న్యాయపోరాటం చేశారు. దీంతో హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగి విచారణ పూర్తి చేసింది. సీబీఐ అధికారులు సీల్డ్ కవర్‌లో దర్యాప్తు నివేదికను హైకోర్టుకు అందజేయడంతో నివేదికలో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
Ayesha Meera
Ayesha Meera case
CBI investigation
Andhra Pradesh High Court
Vijayawada
Ibrahimpatnam hostel
Satyam Babu
Murder investigation
Forensic investigation
Special Investigation Team

More Telugu News