Ali Khamenei: ‘మహిళలు పువ్వు లాంటివారు’.. వైరలవుతున్న ఖమేనీ పాత పోస్టులు!

Woman Is Like A Flower Iran Supreme Leader Ayatollah Ali Khameneis Old Posts Are Viral
  • మహిళల హక్కులు, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి మద్దతుగా ఖమేనీ వ్యాఖ్యలు
  • కవిత్వం, పుస్తకాలపై తనకున్న ఇష్టాన్ని పంచుకున్న ఇరాన్ నేత
  • పదేళ్ల నాటి ఈ పోస్టులు చూసి ఆశ్చర్యపోతున్న సోషల్ మీడియా యూజర్లు
  • ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ఈ పాత ట్వీట్లు వైరల్
ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి సంబంధించిన పాత సోషల్ మీడియా పోస్టులు కొన్ని ఇప్పుడు ఆశ్చర్యకరంగా మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ పోస్టులలో ఖమేనీ మహిళల హక్కులు, కవిత్వంపై తన అభిప్రాయాలను పంచుకోవడం, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి మద్దతు తెలపడం, తన చిన్ననాటి అల్లరి చేష్టల గురించి ప్రస్తావించడం వంటివి ఉన్నాయి. ఈ పోస్టులు చూసిన పలువురు సోషల్ మీడియా యూజ‌ర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు దశాబ్దం క్రితం నాటి ఈ పోస్టులు, ఖమేనీ ప్రస్తుత ఇమేజ్‌కు భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. దీంతో చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరైతే ఆయన ఉదారవాద భావాలను చూసి, ఖమేనీ ఒక ప్రగతిశీల నాయకుడని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పలు పోస్టులలో ఖమేనీ వారికి మద్దతుగా నిలవడమే కాకుండా, ప్రేమ సలహాలు కూడా ఇచ్చారు. 2013 సెప్టెంబర్ 15న చేసిన ఒక పోస్టులో.. "మహిళల అవసరాలు, భావాలను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పురుషుడిపై ఉంది. ఆమె మానసిక స్థితి పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు" అని ఖమేనీ పేర్కొన్నారు. 

అలాగే, 2018 మార్చి 7న చేసిన మరో పోస్టులో... "పురుషుల కంటే మహిళలు బలవంతులు. తమ తెలివి, సున్నితత్వంతో మహిళలు పురుషులను పూర్తిగా నియంత్రించగలరు. ప్రభావితం చేయగలరు" అని తెలిపారు.

ఇక‌,  2013 నవంబర్ 25న చేసిన ఒక పోస్టులో... "స్త్రీ ఒక పువ్వు. ప్రశంస లేకుండా ఒక పువ్వుతో వ్యవహరించే పురుషుడు ఎంత దుర్మార్గుడు" అని ఖమేనీ పేర్కొన్నారు. 

ఈ పోస్టులపై సోషల్ మీడియాలో భిన్నరకాల స్పందనలు వస్తున్నాయి. ఒక ఎక్స్ (గతంలో ట్విట్టర్) యూజర్, "అయతొల్లా ఖమేనీ, నన్ను క్షమించండి. మీ గురించి నాకు ఇంతకుముందు తెలియదు" అని వ్యాఖ్యానించారు. మరొకరు "ప్రేమికుడిగా పుట్టాడు, కానీ సుప్రీం లీడర్ కావలసి వచ్చింది" అంటూ స్పందించారు.

2013 నాటి ఒక పోస్టులో ఖమేనీ తన పాఠశాల రోజుల గురించి గుర్తుచేసుకున్నారు. "మొదటి రోజుల నుంచే నేను పైపంచెతో స్కూలుకు వెళ్లేవాడిని. ఇతర పిల్లల ముందు అది వేసుకోవడం అసౌకర్యంగా ఉండేది. కానీ అల్లరిగా, ఉల్లాసంగా ఉంటూ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాను" అని రాశారు. 2015 ఫిబ్రవరి 25న చేసిన మరో పోస్టులో, "నాకు సినిమా, దృశ్య కళలపై అంత ఆసక్తి లేదు. కానీ కవిత్వం, నవలల విషయానికి వస్తే నేను కేవలం సాధారణ ప్రేక్షకుడిని కాను" అని పేర్కొన్నారు.

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాసిన పుస్తకం చదవడం ద్వారా దేశ గతాన్ని అర్థం చేసుకున్నానని కూడా ఖమేనీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. 2013 ఆగస్టు 6 నాటి పోస్టులో, "నెహ్రూ గారి 'గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ' చదవక ముందు వలసరాజ్యానికి పూర్వం భారతదేశం ఇన్ని ముఖ్యమైన పురోగతులు సాధించిందని నాకు తెలియదు" అని అన్నారు.
Ali Khamenei
Iran
Israel Iran conflict
womens rights
social media posts
Iran supreme leader
Ayatollah Ali Khamenei
middle east politics
Jawaharlal Nehru

More Telugu News