Bandi Sanjay: కేసీఆర్, కేటీఆర్ లను కూడా విచారించాలి: బండి సంజయ్

Bandi Sanjay Demands Investigation on KCR KTR in Phone Tapping Case
  • ఫోన్ ట్యాపింగ్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
  • కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్
  • ప్రభాకర్ రావుకు రాచమర్యాదలు చేస్తున్నారని మండిపాటు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో ఆడుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు కరీంనగర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని, దీని వెనుక ఎవరున్నారో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు.

ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసిన బండి సంజయ్, సిట్ దర్యాప్తు కేవలం తూతూమంత్రంగా సాగుతోందని విమర్శించారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అనేక కుటుంబాలను నాశనం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయి, ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందితే రాచమర్యాదలు చేస్తున్నారని మండిపడ్డారు.

"పెద్దాయన చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులిచ్చి విచారించాలి. సిరిసిల్ల కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లో కేటీఆర్‌ను కూడా విచారించాలి" అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కుమ్మక్కై దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కేసును తక్షణమే సీబీఐకి బదిలీ చేయాలని, ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కేంద్రానికి నేరుగా సీబీఐ విచారణ జరిపే అధికారం ఉంటే నిందితులను ఎప్పుడో చట్టప్రకారం శిక్షించేవాళ్లమని ఆయన వ్యాఖ్యానించారు.

Bandi Sanjay
KCR
KTR
Phone Tapping Case
Telangana Politics
BRS Government
Revanth Reddy
CBI Investigation
Cyber Crime
Karimnagar

More Telugu News