Gummanuru Jayaram: టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు

Gummanuru Jayaram Controversial Comments Against YSRCP Leaders
  • వైసీపీ నాయకులు టీడీపీకి జేజేలు కొట్టకపోతే తోక కత్తిరించి సున్నం పెట్టే రోజు వస్తుందన్న గుమ్మనూరు జయరాం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకుడు ఏ ఒక్కరూ నామినేషన్ వేయకుండా చూసుకోవాలన్న జయరాం
  • లోకేశ్ రెడ్ బుక్ మూసివేసినా స్థానిక ఎన్నికల తర్వాత తాను తెరుస్తానని హెచ్చరించిన జయరాం
గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం తాజాగా వైసీపీ శ్రేణులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల లోపు వైసీపీ నాయకులు అంతా టీడీపీకి జేజేలు కొడితే సరి, లేదంటే తోక కత్తిరించి సున్నం పెట్టే రోజు వస్తుందంటూ జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ ఫంక్షన్ హాలు నందు సంస్థాగత ఎన్నికలపై నిన్న పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులుగా మనవాళ్లనే గెలిపించుకోవాలని పిలుపు ఇవ్వడంతో పాటు ఎన్నికల్లో వైసీపీ నాయకుడు ఏ ఒక్కరూ నామినేషన్ వేయకుండా చూసుకోవాలని అన్నారు. గత ఎన్నికల్లో తనను రౌడీ, గుండా, ఖూనీకోరు అని అన్నారు గానీ తాను అందర్నీ ప్రేమించే వాడినని చెప్పుకొచ్చారు. తన కుటుంబాన్ని ఆదరించిన ప్రతి కార్యకర్త, నాయకులను మరచిపోనని మాట ఇచ్చారు.

నారా లోకేశ్ రెడ్ బుక్ మూసివేసినా తాను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం తెరుస్తానని గుమ్మనూరు హెచ్చరించారు. ప్రస్తుతం గుమ్మనూరు జయరాం చేసిన ఈ సంచలన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుమ్మనూరు జయరాం గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, ఎన్నికల ముందు టీడీపీలో చేరి మరల ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు కూడా గుమ్మనూరు జయరాం పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 
Gummanuru Jayaram
Guntakal
TDP
YSRCP
Andhra Pradesh Politics
Local Body Elections
Anantapur District
Nara Lokesh
AP Elections
Political Controversy

More Telugu News