Gaurav Chintamanidi: అమెరికాలో ఉద్యోగ జీవితం పూలపాన్పు కాదు.. అగ్రరాజ్యంలో ఓ భారతీయుడి వైరల్ పోస్టు

US Job Life Not a Bed of Roses Indians Viral Post
  • కాలేజీ లైఫ్ వేరు, కార్పొరేట్ ప్రపంచం వేరు
  • వారానికి 60 గంటల పని, నిద్రలేని రాత్రులు
  • చదువు తర్వాత ఉద్యోగంలో చేదు అనుభవాలు
  • ఇవన్నీ తన ఒక్కడి అనుభవాలు మాత్రమే కాదన్న యువకుడు
  • ఇలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్న వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం
అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వీసా రాగానే ప్రపంచాన్ని జయించినంత సంతోషం.. యూనివర్సిటీ నుంచి మంచి గ్రేడ్లతో పట్టా అందుకున్నాక మనకిక తిరుగేలేదనే జోష్.. ఇలా ఉద్యోగంలో చేరిపోయి బాగా సంపాదించేస్తూ వారాంతాల్లో విహార యాత్రలతో జీవితాన్ని ఆనందంగా గడపవచ్చని చాలామంది కలలు కంటుంటారు. కానీ అమెరికా జీవితం పూలపాన్పు కాదని, ప్రస్తుత పరిస్థితులలో జీవితం కఠినంగా ఉందని అగ్రరాజ్యంలో ఉద్యోగం చేస్తున్న భారత సంతతి యువకుడు ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. లింక్డ్ ఇన్ లో చేసిన ఈ పోస్టు వైరల్ గా మారింది.
 
చాప్‌మన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన గౌరవ్ చింతమనీడి, ఉద్యోగ జీవితంలో మొదటి ఏడాది తాను పడిన మానసిక, శారీరక ఒత్తిడి గురించి వివరించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత దేశంలో సగం దూరం ప్రయాణించి కొత్త నగరానికి వెళ్లడం తన జీవితంలో "అత్యంత సవాలుతో కూడుకున్న" సమయాల్లో ఒకటని గౌరవ్ తెలిపారు. ప్రస్తుతం ఓ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలో అసిస్టెంట్ స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన, వారానికి 60 గంటల వరకు పనిచేస్తున్నానని, ఇది తాను కాలేజీ తర్వాత ఊహించుకున్న జీవితానికి పూర్తి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
"నేను డీఎంవీ ప్రాంతానికి వచ్చినప్పుడు, టీవీలో చూసే లేదా సోషల్ మీడియాలో ఊహించుకునే 20 ఏళ్ల తొలి దశ జీవితాన్ని గడుపుతానని అనుకున్నాను. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, పని తర్వాత సహోద్యోగులతో డ్రింక్స్, మెట్రోలో అపరిచితులతో మాటలు కలిపి స్నేహితులుగా మార్చుకోవడం వంటివి ఊహించుకున్నాను. వారాంతాల్లో బ్రంచ్‌లు, కాఫీ షాపుల్లో సైడ్ ప్రాజెక్టులు, కొత్త నైపుణ్యాల కోసం రాత్రిపూట ఆన్‌లైన్ కోర్సులు ఉంటాయని భావించాను. కానీ వాస్తవికత భిన్నంగా ఉంది" అని గౌరవ్ తన పోస్టులో రాసుకొచ్చారు.
 
గత ఏడాది కాలంలో వారానికి 50 నుంచి 60 గంటలు పనిచేశానని, చాలా రోజులు ఉదయం 3 గంటలకే నిద్రలేచి విధులకు హాజరయ్యానని ఆయన తెలిపారు. "దాదాపు 95 శాతం వారాంతాలు ఆఫీసులోనే గడిపాను. అరుదుగా సెలవు దొరికితే బయటకు వెళ్లి ఎంజాయ్ చేసేంత ఓపిక ఉండేది కాదు" అని ఆయన పేర్కొన్నారు. వరుసగా ఆరు రోజులు పనిచేసి అలసిపోయి, వేల మైళ్ల దూరంలో ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి మాత్రమే సమయం దొరికేదని వాపోయారు. "కొత్త నగరంలో కొత్త స్నేహితులను చేసుకోవడం నేను ఊహించినంత సులభం కాదు. నా జీవితం కాలేజీలోనే ఆగిపోయిందా అని కూడా అనిపించింది. నిజం చెప్పాలంటే, ఆగలేదు. కానీ కాలేజీ నుంచి వాస్తవ ప్రపంచంలోకి మానసికంగా మారడం నేను ఊహించిన దానికంటే చాలా కష్టంగా ఉంది" అని ఆయన వివరించారు.

అయితే, తన పోస్ట్ ఫిర్యాదు చేయడానికి కాదని, సర్దుకుపోవడానికి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికీ ధైర్యం చెప్పడానికేనని గౌరవ్ స్పష్టం చేశారు. "మీరు కూడా గ్రాడ్యుయేషన్ తర్వాత మొదటి సంవత్సరంలో ఉండి, సర్దుకుపోవడానికి కష్టపడుతుంటే.. మీరు ఒక్కరు మాత్రమే ఇలా ఇబ్బందిపడుతున్నారని అనుకోవద్దు. మీలాగే చాలామంది ఇవే సవాళ్లను ఎదుర్కొంటున్నారు" అని గౌరవ్ తన పోస్టులో ధైర్యం చెప్పారు.
Gaurav Chintamanidi
USA jobs
America jobs
Indian immigrants
work life balance
job stress
DMV area
e-commerce
Chappman University
US work culture

More Telugu News