Pawan: పోలింగ్ శాతం పెంచడంలో మీడియా కీలక పాత్ర: ఈసీఐ ఉప సంచాలకుడు పవన్

Pawan ECI official stresses media role in boosting voter turnout
  • ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు 23 నూతన కార్యక్రమాలు: పి.పవన్
  • ఓటర్ సమాచార స్లిప్ లు మరింత ఉపయోగకరంగా మారనున్నాయన్న పవన్
  • ఇకపై పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు మొబైల్ డిపాజిట్ సదుపాయం ఏర్పాటు చేస్తామని వెల్లడి
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని, అటువంటి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి.పవన్ పేర్కొన్నారు. ప్రాంతీయ స్థాయిలో భారత ఎన్నికల సంఘం కమ్యూనికేషన్ ప్రభావాన్ని, పరిధిని పెంచడం ద్వారా ఓటర్లను చైతన్యపరచడంలో ప్రాంతీయ మీడియా ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం ఏపీ రాష్ట్ర సచివాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి.పవన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి జరిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన 23 నూతన కార్యక్రమాలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బందికి కల్పిస్తున్న సదుపాయాలు, ప్రక్రియాత్మక సంస్కరణలు, చట్టపరమైన చర్యలు, ఈసీఐ నూతన ఆవిష్కరణలు మరియు వనరులను వివరించారు.

ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాల్లో భాగంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలకు ముందు ప్రత్యేక సార్వత్రిక నమోదు (SSR) కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఓటర్ సమాచార స్లిప్‌లు మరింత ఉపయోగకరంగా మారనున్నాయని, ఓటర్ సీరియల్ నంబర్ మరియు పార్ట్ నంబర్‌ను స్పష్టంగా చూపించనున్నామని అన్నారు. మరణాల నమోదుకు సంబంధించిన డేటాను ఆర్‌జీఐ డేటాబేస్ నుండి సేకరించి, ధృవీకరణ తర్వాత ఓటరు జాబితాలో మార్పులు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి గరిష్ఠంగా 1200 మంది ఓటర్లకే అనుమతిస్తున్నామని, ఓటర్లకు మొబైల్ డిపాజిట్ సదుపాయాన్ని, అపార్టుమెంట్లు, కాలనీల్లో అదనపు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

యూనిక్ EPIC నంబర్ పద్ధతిని అమలు పరచడం ద్వారా డూప్లికేట్ EPIC నంబర్ల సమస్య పరిష్కరించడం జరిగిందన్నారు. భారత ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని పలు వెబ్‌సైట్ల ద్వారా పౌరులకు అందుబాటులోకి తేవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఇష్టాగోష్ఠి చర్చా కార్యక్రమంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. 
Pawan
Election Commission of India
ECI
voter turnout
regional media
election process
voter awareness
Andhra Pradesh elections
election reforms
voter registration

More Telugu News