Tanu: మురుగునీటి కోసమని గొయ్యి తవ్వి కోడలిని పూడ్చిపెట్టారు.. ఆపై కోడలు లేచిపోయిందని ప్రచారం.. ఫరీదాబాద్ లో ఘోరం

Haryana Crime Woman Murdered by Husband and In Laws in Faridabad
  • రెండు నెలల తర్వాత వెలుగులోకి దారుణం
  • భర్త, అత్తమామలతో సహా నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
  • అదనపు కట్నం కోసమే హత్య చేశారని మృతురాలి సోదరి ఆరోపణ
హర్యానాలోని ఫరీదాబాద్‌లో అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు కలిసి ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. మురుగు కాల్వ కోసమని గొయ్యి తవ్వి కోడలు మృతదేహాన్ని అందులో పూడ్చిపెట్టారు. ఆపై కోడలు ఎవరితోనో లేచిపోయిందని ప్రచారం చేశారు. రెండేళ్ల క్రితం వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధించడంతో ఏడాది పాటు సదరు వివాహిత పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత కొంత సొమ్ము ముట్టజెప్పి అత్తింట్లో దిగబెట్టగా.. అత్తింటి వారు ఈ ఘోరానికి పాల్పడ్డారు. మృతురాలి సోదరి ఫిర్యాదుతో రెండు నెలల తర్వాత ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనలో దారుణ హత్యకు గురైన వివాహిత ‘తనూ’ మృతదేహాన్ని శుక్రవారం గొయ్యిలో నుంచి పోలీసులు వెలికితీశారు. మృతదేహం కుళ్లిపోవడంతో హత్య జరిగి సుమారు రెండు నెలలకు పైనే అయి ఉంటుందని చెప్పారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి తను భర్త, అత్తమామలు, మరో దగ్గరి బంధువుతో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనూ అత్తింటివారితో నివసించిన ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో కొత్తగా వేసిన కాంక్రీట్ కింద ఈ మృతదేహాన్ని కనుగొన్నారు. సుమారు రెండు నెలల క్రితం మురుగునీటి కాలువ నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో గొయ్యి తవ్వినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.

ఫరీదాబాద్‌లోని రోషన్ నగర్ కు చెందిన అరుణ్‌కు, షికోహాబాద్ కు చెందిన తనూకు సుమారు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కొద్ది నెలలకే అత్తింట్లో తనూకు వేధింపులు మొదలయ్యాయని ఆమె సోదరి ఆరోపించారు. తన సోదరిని అత్తింటివారు బంగారం, డబ్బు కోసం మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టారని చెప్పారు. తమ కుటుంబం శక్తిమేర వారి డిమాండ్లను తీర్చినా, వేధింపులు ఆగలేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. "వేధింపులు తాళలేక పెళ్లయిన కొద్ది నెలలకే తను మాతో పాటు పుట్టింట్లో ఏడాదికి పైగా ఉంది. చివరకు మళ్లీ అత్తింటికి పంపించాక, మళ్లీ చిత్రహింసలు మొదలయ్యాయి. మాతో ఫోన్‌లో కూడా మాట్లాడనిచ్చేవారు కాదు" అని ప్రీతి వాపోయారు.

ఏప్రిల్ 9న తన సోదరికి ఫోన్ చేసినప్పుడు కలవకపోవడంతో అనుమానం వచ్చిందని, ఏప్రిల్ 23న అత్తింటివారు తనూ ఇంటి నుంచి పారిపోయిందని తమకు చెప్పారని ప్రీతి తెలిపారు. దీంతో పోలీసులను ఆశ్రయించినా, చాలా వారాల పాటు సరైన చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని చెప్పి తనూ మామ ఏప్రిల్‌లో ఆ గొయ్యి తవ్వాడని, ఆ తర్వాత దాన్ని హడావుడిగా పూడ్చేసి, పైన సిమెంట్ స్లాబ్ వేశారని స్థానికులు ఇప్పుడు పోలీసులకు, విలేకరులకు తెలిపారు. "గొయ్యి తవ్వడం అందరం చూశాం. మురుగునీటి కోసమని చెప్పారు. ఆ తర్వాత కోడలు కనిపించలేదు. ఏదో తేడాగా ఉందని కొందరికి అనిపించినా, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు" అని తనూ పొరుగింటి వ్యక్తి చెప్పారు.
Tanu
Faridabad crime
dowry death
Haryana murder
honor killing
police investigation
crime news
family dispute
Arun
usha kundu

More Telugu News