Chandrababu Naidu: 'యోగాంధ్ర'పై జగన్ విమర్శలు... సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

Chandrababu Naidu Counters Jagans Criticism on Yogandhra
  • యోగాంధ్ర కోసం ప్రజాధనం వృథా చేస్తున్నారన్న జగన్
  • ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు
  • రుషికొండ ప్యాలెస్‌కు వందల కోట్ల ఖర్చు చేసిన వాళ్లు కూడా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం
  • యోగాంధ్రకు కేంద్రం రూ.75 కోట్లు ఇచ్చిందని స్పష్టీకరణ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా, గిన్నిస్ రికార్డు స్థాయిలో చేపట్టిన 'యోగాంధ్ర' కార్యక్రమంపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రజల డబ్బు వృథా చేస్తున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలను చంద్రబాబు తిప్పికొట్టారు. విశాఖలో శనివారం ఆయన ఈ విషయంపై స్పందించారు.

"కొన్ని సందర్భాల్లో కొందరి గురించి మాట్లాడటం కూడా అనవసరం. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తులు ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది" అని చంద్రబాబు విమర్శించారు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కలుషితం చేసేలా ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. "ఇలాంటి భూతాన్ని (ప్రజలను తప్పుదోవ పట్టించే వారిని ఉద్దేశించి) ఎలా నియంత్రించాలో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తాం" అని చంద్రబాబు తెలిపారు.

యోగాంధ్ర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. "యోగాంధ్ర కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. ప్రజల శ్రేయస్సు కోసమే ఈ కార్యక్రమం చేపట్టాం" అని చంద్రబాబు వివరించారు. ప్రజల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో మేలు చేస్తుందని, అలాంటి కార్యక్రమాలపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Yogandhra
Andhra Pradesh
YSRCP
TDP
Rushikonda Palace
Yoga
Vishakapatnam
Central Government Funds

More Telugu News