Amit Shah: పాకిస్థాన్ గొంతు ఎండాల్సిందే: సింధూ జలాల ఒప్పందంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Amit Shah Comments on Indus Waters Treaty with Pakistan
  • సింధూ నదీ జలాల ఒప్పందం పునరుద్ధరణ ఉండదని అమిత్ షా స్పష్టం
  • పాకిస్థాన్ ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపణ
  • పాక్‌కు వెళ్లే నీటిని కెనాల్ ద్వారా రాజస్థాన్‌కు మళ్లిస్తామని వెల్లడి
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునఃప్రారంభించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఒప్పందంలోని నిబంధనలను పాకిస్థాన్ ఉల్లంఘించిందని, ఇన్నాళ్లూ అన్యాయంగా నీటిని పొందిందని, ఇకపై ఆ దేశం నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.

ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ, "అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేము, కానీ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు భారతదేశానికి ఉంది. మేం అదే చేశాం" అని అన్నారు. ఈ ఒప్పందం పీఠికలో రెండు దేశాలు శాంతి, పురోగతి సాధించాలనే అంశం ఉందని, అయితే ఒకసారి దాన్ని ఉల్లంఘించిన తర్వాత రక్షించడానికి ఏమీ మిగలదని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశానికి హక్కుగా దక్కిన నీటిని సంపూర్ణంగా వినియోగించుకుంటామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కెనాల్ నిర్మించి పాకిస్థాన్‌కు వెళ్లే జలాలను రాజస్థాన్‌కు మళ్లిస్తామని ఆయన వివరించారు. "ఇంతకాలం పాకిస్థాన్ అన్యాయంగా నీటిని పొందింది. ఇకపై ఆ దేశం గొంతు ఎండిపోవాల్సిందే" అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం

1960వ దశకంలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరింది. అయితే, పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన తర్వాత ఈ ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ దేశ నీటి సరఫరా వ్యవస్థ ప్రధానంగా సింధూ జలాలపైనే ఆధారపడి ఉంది. వ్యవసాయానికి వినియోగించే నీటిలో దాదాపు 80 శాతం ఈ ఒప్పందం ద్వారానే లభిస్తోంది. పాకిస్థాన్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 25 శాతం ఈ నదీ జలాల కారణంగానే వస్తుందంటే, భారత తాజా నిర్ణయం భవిష్యత్తులో ఆ దేశంపై ఎంతటి ప్రభావాన్ని చూపనుందో అర్థం చేసుకోవచ్చు.


Amit Shah
Indus Waters Treaty
Pakistan
India
Water Dispute
River Waters

More Telugu News