Koushik Reddy: కౌశిక్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశాడు... ఆయనను దేశం దాటించే ప్రయత్నం జరిగింది: బల్మూరి వెంకట్

Balmuri Venkat fires on KTR and Harish Rao
  • కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్, హరీశ్ పై బల్మూరి వెంకట్ ఆగ్రహం
  • పైసల కోసమే కౌశిక్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపణ
  • బనకచర్ల విషయంలో కేటీఆర్, హరీశ్ లకు బల్మూరి సవాల్
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌ను మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఖండించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డి డబ్బుల కోసం దందాలు చేస్తూ పట్టుబడ్డారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి కేటీఆర్, హరీశ్ మద్దతు పలకడం సిగ్గుచేటని విమర్శించారు.

కౌశిక్‌రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడి అరెస్ట్ కాలేదని, క్రషర్ యజమానులను డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేసినందుకే తెలంగాణ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. కౌశిక్‌రెడ్డి చరిత్ర మొత్తం బ్లాక్‌మెయిలింగ్, ప్రజలను మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఎంతో మంది నిరుద్యోగుల నుంచి కౌశిక్‌రెడ్డి డబ్బులు వసూలు చేశారని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను విదేశాలకు పంపినట్లే, కౌశిక్‌రెడ్డిని కూడా దేశం దాటించే ప్రయత్నం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యే ఒక బ్లాక్‌మెయిలర్ అని తెలిసి హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన్ను గెలిపించినందుకు వారు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని చెప్పారు.

కేటీఆర్, హరీశ్ ఇప్పటికైనా దొంగలకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని బల్మూరి వెంకట్ హితవు పలికారు. మీరు చేసిన దొంగతనాలు కూడా త్వరలోనే బయటపడతాయని అన్నారు. ఈ కారణగానే బనకచర్ల విషయంలో బావ, బామ్మర్దులు ముందుగానే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బనకచర్ల విషయంలో వైసీపీ అధినేత జగన్ తో కేటీఆర్, హరీశ్ లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే బనకచర్ల విషయంపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
Koushik Reddy
Padi Koushik Reddy
Balmoori Venkat
BRS MLA
Telangana politics
Huzurabad
KTR
Harish Rao
Blackmail
Corruption charges

More Telugu News