Padi Kaushik Reddy: రేవంత్ రెడ్డి వల్ల కౌశిక్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు... సెక్షన్లు మార్చండి: ఎర్రబెల్లి

Errabelli Demands Section Changes in Padi Kaushik Reddy Case
  • గ్రానైట్ వ్యాపారిని బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు
  • వరంగల్ సీపీని కలిసిన బీఆర్ఎస్ నేతలు, సెక్షన్ల మార్పునకు విజ్ఞప్తి
  • సీఎం రేవంత్ ఒత్తిడి వల్లే నాన్ బెయిలబుల్ కేసన్న ఎర్రబెల్లి
గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి వరంగల్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు... బీఆర్ఎస్ లీగల్ టీమ్‌తో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌ను కలిశారు. కౌశిక్ రెడ్డిపై నమోదు చేసిన కేసులోని సెక్షన్లను మార్చాలని వారు సీపీని కోరారు. దీనిపై స్పందించిన సీపీ, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తానని వారికి తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి కారణంగానే కౌశిక్ రెడ్డికి బెయిల్ రాకుండా ఉండేందుకు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం కావాలనే లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు పెడుతోందని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా విఫలమైందని, అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. అంతకుముందు, సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కౌశిక్ రెడ్డిని ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సోదరుడు ప్రతీక్ రెడ్డి పరామర్శించారు. వైద్య పరీక్షల అనంతరం కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

Padi Kaushik Reddy
Revanth Reddy
Errabelli Dayakar Rao
BRS leaders
Telangana politics
Huzurabad MLA
Warangal CP
Non-bailable sections
Telangana government
Corruption allegations

More Telugu News