Ponguleti Srinivas Reddy: గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టుపట్టింది: మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy Slams Previous Governments Revenue System
  • బీఆర్ఎస్ హయాంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్న మంత్రి పొంగులేటి
  • రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి
  • మూడు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 10,725 రెవెన్యూ సదస్సులు
  • మొత్తంగా 8.58 లక్షల దరఖాస్తులు స్వీకరణ
  • ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 67 వేల వినతులు
  • దరఖాస్తుల ఆన్‌లైన్‌ నమోదు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, దానిని ప్రక్షాళన చేసి పారదర్శకమైన పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో శనివారం ఆయన హైదరాబాద్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌ 14న 'భూ భారతి' చట్టాన్ని ఆవిష్కరించారని, ఈ చట్టాన్ని దశలవారీగా అమల్లోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా మూడు విడతల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు వివరించారు.

మొదటి విడత ఏప్రిల్‌ 17 నుంచి 30వ తేదీ వరకు నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టగా, రెండో విడతలో మే 5 నుంచి 28 వరకు 28 మండలాల్లో, మూడో విడతలో జూన్ 3 నుంచి 20 వరకు మిగిలిన ప్రాంతాల్లో సదస్సులు విజయవంతంగా పూర్తి చేశామన్నారు.

ఈ మూడు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులను నిర్వహించామని, వీటి ద్వారా ప్రజల నుంచి 8.58 లక్షల దరఖాస్తులు అందాయని మంత్రి వెల్లడించారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 67 వేల దరఖాస్తులు రాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 61 వేలు, వరంగల్‌లో 54 వేలు, జయశంకర్‌ భూపాలపల్లిలో 48 వేలు, నల్గొండ జిల్లాలో 42 వేల దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు.

రెవెన్యూ సదస్సులకు ఒకరోజు ముందే ఆయా గ్రామాల్లో రైతులకు, ప్రజలకు ఉచితంగా దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఎమ్మార్వోల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకు వెళ్లి ఎలాంటి రుసుము తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరించారని వివరించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు రశీదు కూడా అందజేశామన్నారు. ఇప్పటివరకు అందిన దరఖాస్తుల్లో 3.27 లక్షల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేశామని, మిగిలిన వాటిని కూడా వీలైనంత త్వరగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
Ponguleti Srinivas Reddy
Telangana Revenue System
Revenue Department
Bhu Bharathi Act

More Telugu News