Harender Prasad: విశాఖ జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించిన సీఎం చంద్రబాబు

Chandrababu Praises Visakha District Collector Harender Prasad
  • విశాఖలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా యోగాంధ్ర-2025
  • కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావడంపై సీఎం చంద్రబాబు హర్షం
  • కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఎంతో కీలక భూమిక పోషించారని కితాబు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన 'యోగాంధ్ర-2025' కార్యక్రమం విజయవంతం కావడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నిర్వహించడంలో కీలక భూమిక పోషించిన విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కలెక్టర్ చూపిన చొరవ, పటిష్టమైన ప్రణాళిక అమలు తీరును చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

శనివారం విశాఖలో జరిగిన ఈ బృహత్ యోగా కార్యక్రమంలో ఏకంగా 3,02,087 మంది పాల్గొన్నారని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఈ సందర్భంగా ఒకేసారి రెండు గిన్నీస్ ప్రపంచ రికార్డులు నెలకొల్పడం ఇదే మొదటిసారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇంతటి ఘనవిజయం ప్రజల చైతన్యం, భాగస్వామ్యం వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. ప్రకృతి కూడా అనుకూలించిందని, కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు కలగలేదని పేర్కొన్నారు.

దాదాపు 20 రోజుల క్రితమే వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించామని చంద్రబాబు వివరించారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎటువంటి చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. ఈ విజయం వెనుక అధికారుల అంకితభావం, కూటమి నేతల సమన్వయంతో కూడిన పనితీరు ఎంతగానో దోహదపడ్డాయని కొనియాడారు. ఈ కార్యక్రమం ద్వారా యోగా ప్రాముఖ్యత మరింతగా ప్రజల్లోకి వెళ్లిందని, ఆరోగ్య స్పృహ పెరిగిందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
Harender Prasad
Visakha District Collector
Chandrababu Naidu
Yoga Andhra 2025
International Yoga Day
Guinness World Record
Visakhapatnam
Yoga Program
Andhra Pradesh
Yoga Awareness

More Telugu News