Tiger: ఇద్దరిని పొట్టనపెట్టుకున్న పులిని చాకచక్యంగా బంధించిన అధికారులు

Tiger Responsible for Two Deaths Captured in Madhya Pradesh
  • సియోని జిల్లాలో ఇద్దరిని బలిగొన్న పులి ఎట్టకేలకు పట్టివేత
  • బావన్‌తాడి గ్రామ సమీపంలో మత్తుమందు ఇచ్చి బంధించిన వైనం
  • గురువారం 18 ఏళ్ల యువకుడిపై దాడి చేసి చంపిన పులి
  • గతంలోనూ పలు దాడులు, అటవీ సిబ్బందిపైనా దాడి చేసిన పులి
మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో గ్రామస్థులను కొన్ని నెలలుగా భయభ్రాంతులకు గురిచేస్తూ, ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన ఓ పులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. శుక్రవారం బావన్‌తాడి గ్రామ సమీపంలో ఈ పులిని పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బంధించిన పులిని తదుపరి సంరక్షణ నిమిత్తం భోపాల్‌లోని వాన్ విహార్ జాతీయ పార్కుకు తరలించారు.

బావన్‌తాడి గ్రామ సమీపంలో సంచరిస్తున్న ఈ పులి కదలికలపై అటవీశాఖ అధికారులు కొంతకాలంగా నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం టైగర్ రిజర్వ్‌కు చెందిన వన్యప్రాణి వైద్య నిపుణుడు డాక్టర్ అఖిలేష్ మిశ్రా నేతృత్వంలోని ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి పులికి మత్తుమందు ఇచ్చి బంధించారు. అనంతరం, అపస్మారక స్థితిలో ఉన్న పులిని అటవీ సిబ్బంది ఒక మంచంపై సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడ దాని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసిన తర్వాత, ప్రత్యేక రవాణా బోనులో ఉంచి భోపాల్‌లోని వన్ విహార్ జాతీయ పార్కుకు తరలించారు.

తాజా ఘటన.. ప్రజల ఆగ్రహం
ఈ పులిని బంధించడానికి ఒకరోజు ముందు గురువారం బావన్‌తాడి గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పశువులను మేపడానికి వెళ్లిన 18 ఏళ్ల యువకుడిపై పులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు జాతీయ రహదారి 44ను దిగ్బంధించి నిరసన తెలిపారు.

ఈ పులి ఈ ప్రాంతంలో ప్రాణాంతక దాడి చేయడం ఇది రెండోసారి. గత ఏడాది నవంబర్‌లో కూడా ఇదే పులి దాడిలో ఒక వ్యక్తి మరణించారు. అంతేకాకుండా కొన్ని నెలలుగా ఈ పులి పశువులపై దాడులు చేయడం, అటవీశాఖ సిబ్బందిని కూడా లక్ష్యంగా చేసుకోవడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై అటవీశాఖ ఎస్డీవో ఆశిష్ పాండే స్పందించారు. "ఈ పులి మనుషులపై దాడి చేసి చంపడమే కాకుండా, జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలకు సమీపంగా వస్తూ పశువులను వేటాడింది. అటవీ సిబ్బందిపై కూడా దాడికి పాల్పడింది. దాని దూకుడు ప్రవర్తన, వరుస దాడుల ఘటనల నేపథ్యంలో ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణి సంరక్షణను కూడా దృష్టిలో ఉంచుకుని పులిని బంధించడమే సురక్షితమైన మార్గమని భావించాం" అని ఆయన తెలిపారు.  
Tiger
Madhya Pradesh
Seoni
Bawanthadi
Van Vihar National Park
Tiger attack
Wildlife
Forest department
Animal rescue
National Highway 44

More Telugu News