Kashmiri Students: ఇరాన్‌లో ఇంకా 700 మంది కశ్మీరీ విద్యార్థులు

Kashmiri Students 700 Kashmiri Students Still Stranded in Iran
  • విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని అధికారుల ప్రకటన 
  • ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలింపు
  • భారతీయుల కోసం తమ గగనతలాన్ని తెరిచిన ఇరాన్
  • ఇప్పటికే దాదాపు 1000 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరిక
జమ్మూకశ్మీర్‌కు చెందిన 700 మందికిపైగా విద్యార్థులు ఇరాన్‌లోని టెహ్రాన్, కెర్మాన్, గిలాన్, షిరాజ్, అరాక్ వంటి పలు ప్రాంతాల్లో ఇంకా చిక్కుకుపోయి ఉన్నారని, వారిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జమ్మూకశ్మీర్ విద్యార్థుల సంఘం తెలిపింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి తీసుకురావాల్సి ఉందని పేర్కొంది. వారి భద్రత, సకాలంలో తరలింపు కోసం తాము విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. 

ప్రస్తుతం విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని తల్లిదండ్రులకు తాము హామీ ఇస్తున్నట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని, రాబోయే రెండు రోజుల్లో వారిని స్వదేశానికి పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కూడా వారు తెలిపారు. చిక్కుకుపోయిన ప్రతి విద్యార్థి క్షేమం తమకు ముఖ్యమని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరే వరకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూనే ఉంటామని పేర్కొన్నారు.

ఈ విషయంపై ఇరాన్ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్, మహమ్మద్ జవాద్ హొస్సేనీ మాట్లాడుతూ భారతీయులను తాము తమ సొంత ప్రజల్లా భావిస్తామని, తమ గగనతలం మూసివేసినప్పటికీ భారతీయ పౌరుల సురక్షిత ప్రయాణం కోసం దానిని తెరిచేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 

టెహ్రాన్ తమ గగనతలాన్ని తెరవడంతో శుక్రవారం రాత్రి, శనివారం ఇరాన్ నుంచి దాదాపు 1000 మంది విద్యార్థులతో కూడిన విమానాలు ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ‘ఆపరేషన్ సింధు’ ద్వారా మిగిలిన విద్యార్థులను కూడా త్వరలోనే స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది.
Kashmiri Students
Iran
Indian Embassy Tehran
Operation Sindhu
Student Evacuation
Tehran
Jammu and Kashmir
Mohammad Javad Hosseini
Indian Students

More Telugu News