Donald Trump: దాడులు మున్ముందు మరింత భీకరంగా ఉంటాయి.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక

Donald Trump Warns Iran of More Severe Attacks
  • ఇరాన్‌లోని మూడు కీలక అణుకేంద్రాలపై అమెరికా సైనిక దాడులు
  • ఇరాన్ వెంటనే ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం చేసుకోవాలని డిమాండ్
  • ప్రతీకార చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌కు హెచ్చరిక
  • ట్రంప్ నిర్ణయాన్ని చారిత్రాత్మకమన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇరాన్‌లోని మూడు కీలక అణు స్థావరాలపై దాడిచేసినట్టు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌కు మరోమారు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ దాడుల అనంతరం ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో ఇకనైనా శాంతి ఒప్పందం చేసుకోవాలని కోరారు. 

దాడుల అనంతరం వైట్‌హౌస్ నుంచి ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇరాన్‌పై అమెరికా దాడులను ‘అద్భుతమైన సైనిక విజయం’గా అభివర్ణించారు. ఇరాన్‌ కీలక అణు ఇంధన తయారీ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, మధ్యప్రాచ్యంలో రౌడీలా వ్యవహరిస్తున్న ఇరాన్ ఇప్పుడు శాంతి నెలకొల్పాలని పేర్కొన్నారు. శాంతికి కనుక ఒకవేళ వారు అంగీకరించకుంటే భవిష్యత్ దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని తీవ్ర హెచ్చరికలు చేశారు.  

మూడు నిమిషాలపాటు ప్రసంగించిన ట్రంప్ ఈ రాత్రి జరిగిన దాడి అన్నింటికంటే కష్టమైనది, అత్యంత ప్రమాదకరమైనదని పేర్కొన్నారు. ఇరాన్ నుంచి శాంతి ప్రకటన రాకుంటే  మిగిలిన లక్ష్యాలను కూడా కచ్చితత్వంతో ఛేదిస్తామని నొక్కి చెప్పారు. 

ట్రంప్‌ను ప్రశంసించిన నెతన్యాహు
ఇరాన్ కీలక అణు కేంద్రాలపై అమెరికా దాడి అనంతరం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని ప్రశంసించారు. భూమ్మీద మరే దేశం చేయలేని పనిని అమెరికా చేసిందని ప్రశంసించారు. ఇరాన్ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలనుకున్న ట్రంప్ సాహసోపేత నిర్ణయం అమెరికా అద్భుతమైన, ధర్మబద్ధమైన శక్తితో చరిత్రను మారుస్తుందని నెతన్యాహు పేర్కొన్నారు. 
Donald Trump
Iran
US Iran conflict
Israel
Benjamin Netanyahu
Nuclear program
Middle East
Airstrikes
White House
Peace agreement

More Telugu News