Pahalgam Terror Attack: పహల్గామ్ దాడి పాకిస్థానీయుల పనే.. ఎన్ఐఏ దర్యాప్తులో కీలక పురోగతి

Pahalgam Attack NIA Probes Pakistani Lashkar e Taiba Involvement
  • దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే సభ్యులుగా గుర్తింపు
  • పహల్గామ్ లో వారికి ఆశ్రయమిచ్చిన ఇద్దరి అరెస్ట్
  • నిందితులపై యూఏపీఏ సెక్షన్ 19 కింద కేసు నమోదు
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ఘాతుకానికి పాల్పడింది పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులని ఎన్ఐఏ నిర్ధారించింది. వీరికి సహకరించిన ఇద్దరు స్థానికులు పర్వేజ్ అహ్మద్ జోతార్ (బట్‌కోట్, పహల్గామ్ నివాసి), బషీర్ అహ్మద్ జోతార్ (హిల్ పార్క్, పహల్గామ్ నివాసి) లను అరెస్టు చేసినట్లు వెల్లడించింది.

వారిని విచారించగా.. పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ జాతీయులని, నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన వారని ధ్రువీకరించారని చెప్పారు. దాడికి ముందు పర్వేజ్, బషీర్ ఉద్దేశపూర్వకంగానే హిల్ పార్క్‌లోని ఒక సీజనల్ గుడిసెలో (ధోక్) ఈ ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారని పేర్కొన్నారు. వీరు ఉగ్రవాదులకు ఆహారం, వసతితో పాటు ఇతర లాజిస్టికల్ సహకారం కూడా అందించారని తెలిపారు.

అరెస్టు చేసిన ఇద్దరు నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్ 19 (ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించినందుకు శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.
Pahalgam Terror Attack
NIA Investigation
Lashkar-e-Taiba
Pakistani Terrorists
Jammu and Kashmir
Pervez Ahmad Jotar
Bashir Ahmad Jotar
Terrorism
UAPA Act

More Telugu News