Lavu Sri Krishna Devarayalu: జగన్ వాహనం కిందపడి వ్యక్తి మృతి... ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారంటే...!

Lavu Sri Krishna Devarayalu reacts to person death under Jagan convoy vehicle
  • జగన్ కాన్వాయ్ కిందపడి వ్యక్తి మృతి
  • రాజకీయ ర్యాలీలో వ్యక్తి మృతి చెందడంపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆవేదన
  • నేతల కార్యక్రమాలు విషాదాలకు దారితీయకూడదని వ్యాఖ్య
  • ప్రమాద ఘటనలపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దారుణమని విమర్శ
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి
రాజకీయ నాయకుల ర్యాలీలలో ఎవరి ప్రాణాలకు హాని కలిగే పరిస్థితి రాకూడదని నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభిప్రాయపడ్డారు. ఇటీవల జగన్ కాన్వాయ్ వాహనం కిందపడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాజకీయాలు ఎన్నటికీ ప్రాణాలను బలిగొనకూడదని పేర్కొన్నారు.

ర్యాలీలు, రోడ్‌షోలు ప్రజలలో ఆశను, భరోసాను నింపేవిగా ఉండాలి తప్ప, విషాదాలకు కేంద్రాలుగా మారకూడదని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ప్రజా జీవితంలో భద్రత, గౌరవం, మానవత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వీటి విషయంలో రాజీ పడకూడదని ఆయన సూచించారు. ఏ నాయకుడి ప్రచార కార్యక్రమమైనా ప్రజల ప్రాణాల కంటే గొప్పది కాదని స్పష్టం చేశారు.

ఇలాంటి విషాద ఘటనలు జరిగినప్పుడు ఎటువంటి బాధ్యత తీసుకోకుండా, వాటిని కేవలం సాధారణ సంఘటనలుగా పరిగణించడం అత్యంత దుర్మార్గమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే ఇలాంటి రాజకీయాలకు ఇప్పటికైనా స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

ఈ దురదృష్టకర ఘటనపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు తక్షణమే విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై స్వతంత్ర విచారణ జరిపించాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కిచెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన కాన్వాయ్ వాహనాలపైనా, కార్యక్రమ నిర్వాహకులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల భద్రతకు పెద్దపీట వేయాలని ఆయన సూచించారు. ఈ  మేరకు జగన్ వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన వీడియోను కూడా పంచుకున్నారు.
Lavu Sri Krishna Devarayalu
Jagan
Singayya
Andhra Pradesh
TDP MP
Roadshow accident
Political rallies
Narasaraopet
YSRCP
Police investigation

More Telugu News