Hezbollah: మాటమార్చిన హిజ్బుల్లా... ఇరాన్ కు హ్యాండిచ్చిన పాత మిత్రుడు!

Hezbollah changes stance as Old friend gives Iran the cold shoulder
  • ఇరాన్‌కు మద్దతు వైఖరి మార్చుకున్న లెబనాన్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా
  • అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడులు చేయబోమని స్పష్టం చేసిన హిజ్బుల్లా ప్రతినిధి
  • ఇరాన్ తనను తాను రక్షించుకోగలదని, తమ జోక్యం అవసరం లేదని వ్యాఖ్య
  • కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి
  • ఇజ్రాయెల్ ముందు దాడి చేస్తే తప్ప తాము స్పందించబోమని పేర్కొన్న హిజ్బుల్లా
ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి, దాడులతో సతమతమవుతున్న ఇరాన్‌కు మరో ప్రతికూల పరిణామం ఎదురైంది. ఇరాన్‌కు నమ్మకమైన మిత్రపక్షంగా, లెబనాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ అనూహ్యంగా తన వైఖరిని మార్చుకుంది. గతంలో ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు సిద్ధమని ప్రకటించిన హిజ్బుల్లా, ఇప్పుడు ఆ మాటను వెనక్కి తీసుకుంది.

తాజాగా హిజ్బుల్లా సంస్థ అధికార ప్రతినిధి ఒకరు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. తమ సంస్థ కాల్పుల విరమణ ఒప్పందానికి పూర్తిగా కట్టుబడి ఉందని ఆ ప్రతినిధి తెలిపారు. "ఇజ్రాయెల్ ముందుగా దాడులకు పాల్పడితే తప్ప, మేం వారి భూభాగంపై ఎలాంటి దాడులు చేయబోం" అని హిజ్బుల్లా స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా టెహ్రాన్‌పై దాడులకు దిగినా, తాము ఇజ్రాయెల్‌పై గానీ, అమెరికాపై గానీ ఎలాంటి దాడులకు పాల్పడబోమని వివరించారు. 

"ఇరాన్ తనను తాను సమర్థంగా రక్షించుకోగలదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసికట్టుగా దాడి చేసినా, ఆ రెండు దేశాలకు ఇరాన్ తగిన విధంగా బుద్ధి చెప్పగలదు" అని హిజ్బుల్లా ప్రతినధి తెలిపారు.

గత ఏడాది నవంబర్ నెలలో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. హమాస్‌కు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగడంతో, ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా ప్రతిస్పందించింది. హిజ్బుల్లాకు చెందిన అనేక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జోక్యంతో ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తాజా ప్రకటనతో హిజ్బుల్లా ఆ ఒప్పందానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పరిణామం ఇరాన్‌కు దౌత్యపరంగా, సైనికపరంగా కొంత నిరాశ కలిగించే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Hezbollah
Iran
Israel
Lebanon
US
Hezbollah Israel conflict
Iran Israel relations
Middle East tensions
Ceasefire agreement
Hezbollah withdrawal

More Telugu News