Donald Trump: 'మిడ్ నైట్ హ్యామర్'... ఇరాన్ పై దాడుల పట్ల స్పందించిన అమెరికా రక్షణ శాఖ

Pete Hegseth Briefs on US Strike on Iran Nuclear Facilities
  • ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా 'మిడ్‌నైట్ హ్యామర్' పేరుతో దాడి
  • ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై భీకర దాడులు
  • ఇరాన్‌లో అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడమే ధ్యేయమని అమెరికా స్పష్టం
ఇరాన్ అణు కార్యక్రమానికి గట్టి దెబ్బ తగిలేలా అమెరికా భారీ వైమానిక దాడులకు దిగింది. గత కొన్ని దశాబ్దాలలో ఇదే అతిపెద్ద వైమానిక చర్య అని భావిస్తున్నారు. ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్‌లలో ఉన్న కీలక అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ధృవీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష ఆదేశాలతో 'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్' పేరుతో చేపట్టిన ఈ చర్య "అద్భుతమైన, సంపూర్ణ విజయం" సాధించిందని ఆయన ఆదివారం ఒక విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

"అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన ఈ ఆపరేషన్ సాహసోపేతమైనది, అద్భుతమైనది. అమెరికా నిరోధక శక్తి తిరిగి వచ్చిందని ఇది ప్రపంచానికి చాటింది. ఈ అధ్యక్షుడు మాట్లాడితే ప్రపంచం వినాలి" అని హెగ్సెత్ స్పష్టం చేశారు.

అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ తో పాటు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ ఎయిర్ ఫోర్స్ జనరల్ డాన్ కెయిన్ కూడా వివరాలు వెల్లడించారు. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ నగరాల్లోని ఇరాన్ అణు కేంద్రాలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయని, విధ్వంసం అంచున ఉన్నాయని ప్రాథమిక నష్ట అంచనా నివేదికలు చెబుతున్నాయని వారు తెలిపారు. తుది అంచనా ఇంకా కొనసాగుతోందని వారు పేర్కొన్నారు. 

"మేము ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేశాం" అని హెగ్సెత్ అన్నారు. "ఈ ఆపరేషన్ ఇరాన్ సైనికులు లేదా ప్రజలను లక్ష్యంగా చేసుకోలేదు" అని ఆయన స్పష్టం చేశారు. "ఈ మిషన్ ఇరాన్ లో ప్రభుత్వ మార్పు కోసం కాదు. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడం మా లక్ష్యం కాదు. ఇరాన్ అణు కార్యక్రమం వల్ల మా జాతీయ ప్రయోజనాలకు ఎదురయ్యే ముప్పును నిర్వీర్యం చేయడానికే అధ్యక్షుడు (డొనాల్డ్ ట్రంప్) ఈ కచ్చితమైన ఆపరేషన్‌కు అనుమతించారు" అని హెగ్సెత్ వివరించారు. దాడి అనంతరం శాంతి చర్చల కోసం ఇరాన్‌కు బహిరంగంగా, అంతర్గతంగా సందేశాలు పంపుతున్నామని కూడా ఆయన తెలిపారు. శాంతి కోసం ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు కోరినప్పటికీ, ఇరాన్ పట్టించుకోలేదని హెగ్సెత్ గుర్తుచేశారు.

భూగర్భ అణు కేంద్రాలపై భారీ బాంబులు, క్షిపణులు
ఈ ఆపరేషన్‌లో భాగంగా, ఏడు B-2 స్పిరిట్ బాంబర్లు మొత్తం పద్నాలుగు 30,000 పౌండ్ల బరువున్న జీబీయూ-57 భారీ విధ్వంసక బాంబులను (MOPs) జారవిడిచాయి. ఇవి భూగర్భంలో లోతుగా నిర్మించిన ఫోర్డో, నతాంజ్ అణు కేంద్రాలపై పడినట్లు సమాచారం. ఇస్ఫహాన్‌లోని లక్ష్యాలపై జలాంతర్గామి నుంచి టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించారు. ఇక్కడ ఇరాన్ భారీ మొత్తంలో అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వ చేసిందని అమెరికా వర్గాలు తెలిపాయి.

"ప్రపంచంలో మరే ఇతర సైనిక శక్తి ఇలాంటి చర్యను చేపట్టలేదు" అని జనరల్ డాన్ కెయిన్ అన్నారు. "చాలా తక్కువ సమాచార మార్పిడితో, ప్రత్యర్థిని జాగ్రత్తగా ఏమార్చే వ్యూహాలతో ఈ ఫలితాలు సాధించాం" అని ఆయన వివరించారు. ఈ దాడుల్లో 125కి పైగా విమానాలు, సహాయక విభాగాలు పాలుపంచుకున్నాయని, వీటిలో స్టెల్త్ ఫైటర్లు, నిఘా విమానాలు, గాలిలో ఇంధనం నింపే ట్యాంకర్లు ఉన్నాయని జనరల్ కెయిన్ తెలిపారు. "అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద B-2 ఆపరేషన్, ప్రపంచంలో రెండో అతిపెద్దది" అని ఆయన పేర్కొన్నారు.

Donald Trump
Iran nuclear program
Operation Midnight Hammer
Pete Hegseth
Fordow
Natanz
Isfahan
US military strike
nuclear facilities
US defense secretary

More Telugu News