Iran nuclear program: అమెరికా దాడుల్లో ఇరాన్ అణుకేంద్రం ధ్వంసం... శాటిలైట్ ఫొటోలు ఇవిగో!

Iran nuclear program destroyed in US Airstrikes Satellite Images
  • ఫోర్డో అణుకేంద్రంపై అమెరికా విధ్వంసం
  • ఇరాన్ భారీ నష్టాన్ని చవి చూసిందని ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడి
  • అమెరికా దాడికి ముందే కీలక పరికరాలతో పాటు శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ తరలించిందనే అనుమానాలు
అమెరికా జరిపిన బంకర్ బస్టర్ బాంబు దాడులతో ఇరాన్‌లోని ఫోర్డో భూగర్భ అణుకేంద్రం పరిసరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పేలుళ్ల ధాటికి పర్వత భాగం రంగు మారినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అమెరికా దాడిలో ఫోర్డో భూగర్భ అణుకేంద్రం ముఖ ద్వారాలు దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే అగ్రరాజ్యం దాడికి ముందే ఇరాన్ కీలక పరికరాలతో పాటు శుద్ధి చేసిన యురేనియంను తరలించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పర్వతం కింద వంద మీటర్ల లోతులోని అణుకేంద్రం లక్ష్యంగా అమెరికా 14 బంకర్ బస్టర్ బాంబు దాడులు నిర్వహించగా, ఆ ప్రాంతంలో భారీ బిలాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అమెరికా దాడికి ముందే అణుకేంద్రం ప్రవేశద్వారం మూసివేసినట్లు సమాచారం. దాడుల అనంతరం పర్వత భాగాల రంగు మారిందని, వాటి ఆకృతులు కూడా మునుపటి చిత్రాల కంటే భిన్నంగా కనిపించాయని అంటున్నారు.

పేలుళ్ల ధాటికి శిధిలాలు ఎగిరిపడటం వల్లనే పర్వతభాగాలు రంగు మారి కనిపిస్తున్నాయని అంచనా వేశారు. ఈ దాడికి అమెరికా బంకర్ బస్టర్ బాంబును ఉపయోగించిందని చెప్పేందుకు ఇదే నిదర్శనమని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున పొగ కూడా వ్యాపించింది.

ఇరాన్‌లోని ఫోర్డోతో పాటు నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైనా అమెరికా వైమానిక దాడులు చేసింది. మిడ్ నైట్ హామర్ అనే సైనిక చర్యతో ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడులలో ఇరాన్ భారీ నష్టాలను చవి చూసిందని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైందని అమెరికా పేర్కొంది. ఇరాన్ రక్షణ వ్యవస్థ ఈ స్టెల్త్ విమానాలను గుర్తించలేకపోయింది. అయితే అణు కేంద్రాలకు జరిగిన నష్టాన్ని ఇరాన్ అంచనా వేయాల్సి ఉంది. 
Iran nuclear program
Fordow nuclear facility
US airstrikes
Iran nuclear deal
Natanz
Isfahan
Midnight Hammer operation
Bunker buster bombs
Satellite images
Nuclear weapons

More Telugu News