B-2 Bomber: బీ-2 బాంబర్లు సురక్షితంగా తిరిగొచ్చాయని వైట్‌హౌస్ వీడియో విడుదల

B2 Bomber Returns Safely After Iran Airstrikes White House Video Released
  • ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు
  • నిన్న‌ 'ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్' పేరుతో ఈ దాడుల నిర్వహణ
  • బీ-2 బాంబర్లు సురక్షితంగా తిరిగొచ్చాయన్న‌ వైట్‌హౌస్ 
  • ఈ మేరకు వీడియో విడుద‌ల చేసిన శ్వేత‌సౌధం
ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించడం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్‌లలో ఉన్న మూడు ఇరాన్ అణు కేంద్రాలపై బాంబు దాడులు జరిపిన అనంతరం బీ-2 బాంబర్లు మిస్సోరిలోని వైట్‌మ్యాన్ వైమానిక స్థావరానికి సురక్షితంగా తిరిగి వచ్చిన వీడియోను వైట్‌హౌస్ సోమవారం విడుదల చేసింది. అమెరికా సైన్యాన్ని 'ప్రపంచం ఇప్పటివరకు చూసిన గొప్ప స్వేచ్ఛా శక్తి' అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం అభివర్ణించింది.

"ఇరాన్ దాడి అనంతరం బీ-2 బాంబర్లు మిస్సోరిలోని వైట్‌మ్యాన్ వైమానిక స్థావరానికి సురక్షితంగా చేరుకున్నాయి. దేవుడు అమెరికా సైన్యాన్ని ఆశీర్వదించాలి. ప్రపంచం ఇప్పటివరకు చూసిన గొప్ప స్వేచ్ఛా శక్తి ఇదే" అని వైట్‌హౌస్ పేర్కొంది. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ ఫుటేజీలో అమెరికా అత్యంత అధునాతన వ్యూహాత్మక ఆయుధమైన బీ-2 బాంబర్ విమానం అమెరికా వైమానిక స్థావరంపై ఎగురుతూ, ల్యాండ్ అవడం చూడొచ్చు. పెంటగాన్ అధికారిక తక్షణ ప్రతిస్పందన బృందం కూడా ఈ వీడియోను తిరిగి షేర్ చేస్తూ, "వెల్‌కమ్ హోమ్ బాయ్స్" అని వ్యాఖ్యానించింది.

ఇక‌, నిన్న‌ 'ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్' పేరుతో ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకుంది. ఈ దాడులతో టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశామని అమెరికా ప్రకటించింది. ఈ సంఘటనతో మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధం చెలరేగుతుందనే భయాలు వ్యాపించాయి.

బీ-2 బాంబర్ల విధ్వంసక శక్తి
బీ-2 బాంబర్లు అత్యంత అధునాతనమైన గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించి, ఇరాన్ భూగర్భ అణు పరిశోధన కేంద్రాల వంటి పటిష్ఠ‌మైన లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యం వాటి సొంతం. అమెరికా వైమానిక దళం ప్రకారం, బీ-2 భారీ ఆయుధ సంపత్తిని మోసుకెళ్లగలదు. దీని "స్టీల్త్" (గూఢచారి) లక్షణాలు అత్యంత పటిష్ఠంగా రక్షించబడిన లక్ష్యాలకు కూడా చాలా ఈజీగా ఛేదించ‌గ‌ల‌వు. ఒక్కో బీ-2 బాంబర్ ఖరీదు సుమారు 2.1 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. 

ఇవి ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన సైనిక విమానాలు. ఇవి 40,000 పౌండ్లకు (18,144 కిలోగ్రాములు) పైగా పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల వివిధ సంప్రదాయ, అణ్వాయుధాలను మోసుకెళ్లగలవు. ఈ బాంబర్ అంతర్గత ఆయుధ విభాగాలను ప్రత్యేకంగా స్టీల్త్ లక్షణాలను కొనసాగిస్తూనే భారీ ఆయుధాలను అమర్చే విధంగా రూపొందించారు. ఈ విమానం 16 బీ83 అణు బాంబులను మోసుకెళ్లగలదు.

ఇరాన్‌పై దాడి చేసిన బీ-2 బాంబర్లు జీబీయూ-57 బంకర్ బస్టర్‌లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది 30,000 పౌండ్ల (సుమారు 13,600 కిలోగ్రాములు) బరువున్న బాంబు. ఇది భూమిలోకి 200 అడుగుల లోతు వరకు చొచ్చుకుపోయి పేలగలదు. జీబీయూ-57 అమెరికా ఆయుధాగారంలో అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్. 

ఇరాన్ ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా ఆరు బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించిందని, ఈ కేంద్రాన్ని ధ్వంసం చేసే శక్తి అమెరికాకు మాత్రమే ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు దాడుల్లో అమెరికా 30 టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు, ఎఫ్-22 రాప్టర్లు, ఎఫ్-35ఏ లైట్నింగ్ యుద్ధ విమానాలను కూడా ఉపయోగించింది.
B-2 Bomber
Iran
Nuclear Facilities
White House
Donald Trump
Middle East
US Military
Whiteman Air Force Base
GBU-57
Bunker Buster

More Telugu News