Jagan Mohan Reddy: జగన్ కాన్వాయ్ ప్రమాదం వీడియో వైరల్... కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్

YSRCP Alleges Conspiracy After Jagan Convoy Accident Video Goes Viral
  • కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తోందని ఆరోపణ
  • పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలా చేస్తోందని మండిపాటు
  • జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్న వైసీపీ
వైసీపీ అధినేత కాన్వాయ్‌కు సంబంధించినదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ప్రమాద వీడియోపై ఆ పార్టీ తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ వీడియోను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రకు పాల్పడుతోందని ఎక్స్ వేదికగా ఆరోపించింది. రాష్ట్రంలో పాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని వైసీపీ సోషల్ మీడియా విభాగం విమర్శించింది.

జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు వస్తున్న భారీ ప్రజా స్పందనను కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని వైసీపీ ఆరోపించింది. అందుకే, వైసీపీ నాయకులను వేధించడం, తప్పుడు కేసులు నమోదు చేయడంతో పాటు ప్రమాదాలను కూడా రాజకీయం చేస్తోందని మండిపడింది. జగన్ ఇటీవల పల్నాడు పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మరణించడం దురదృష్టకరమని, ఈ ఘటనపై మానవత్వంతో వ్యవహరించాల్సింది పోయి, అత్యంత బాధాకరమైన రీతిలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని వైసీపీ పేర్కొంది. ఈ విషయం తెలిసిన మరుసటి రోజే మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యక్తిగతంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును కూడా అందజేశారని వైసీపీ సోషల్ మీడియాలో వెల్లడించింది.

అయితే, ప్రమాదానికి కారణమైన వాహనం జగన్ కాన్వాయ్‌లోనిది కాదని, అది ఓ ప్రైవేటు వాహనమని పల్నాడు జిల్లా ఎస్పీ ఇప్పటికే స్పష్టంగా తెలిపారని వైసీపీ గుర్తుచేసింది. సంబంధిత వాహన డ్రైవర్, యజమానిని గుర్తించి విచారించగా, ఈ ప్రమాదానికి కాన్వాయ్‌తో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారని కూడా తెలిపింది. ఇన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ, ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత, జగన్‌దే తప్పు అన్నట్లుగా కూటమి సర్కార్ ఓ వీడియోను విడుదల చేసిందని వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీడియోలో కాన్వాయ్ చుట్టూ పెద్ద సంఖ్యలో జనం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని, ఆ ప్రమాదం జరిగిందన్న విషయం జగన్‌కు తెలియదని వైసీపీ తెలిపింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్‌కు కనీసం రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ బృందాన్ని కేటాయించాల్సి ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం తగిన భద్రత కల్పించడంలో విఫలమైందని, ఫలితంగా పదేపదే లోపాలు తలెత్తుతున్నాయని ఆరోపించింది. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆయన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ తీవ్రంగా విమర్శించింది. నీతి, నిజాయతీ, బాధ్యతాయుతమైన రాజకీయాలకు తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపింది.
Jagan Mohan Reddy
Jagan convoy accident
YSRCP
Andhra Pradesh politics
coalition government
Palanadu district
Ambati Rambabu
Singaiah death
security breach
political conspiracy

More Telugu News