Iran: ఇరాన్‌ జోలికెళ్లొద్దు.. అమెరికాలో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు

War Protests Erupt in US After Iran Airstrikes
  • న్యూయార్క్, వాషింగ్టన్ సహా పలు నగరాల్లో నిరసనలు
  • ఇజ్రాయెల్‌కు మద్దతు ఆపాలని, ఇరాన్‌తో యుద్ధం వద్దని డిమాండ్
  • అమెరికా నగరాల్లో హై అలర్ట్.. భద్రత కట్టుదిట్టం
ఇరాన్‌లోని మూడు కీలక అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. ఈ దాడుల అనంతరం అమెరికాలోని పలు ప్రధాన నగరాల్లో నిన్న యుద్ధ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ఇరాన్‌తో యుద్ధానికి దిగొద్దని, ఇజ్రాయెల్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు.

‘ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్’ పేరుతో అమెరికా సైనిక దళాలు ఇరాన్‌లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నాటాంజ్ అణు కేంద్రాలపై బాంబు దాడులు జరిపాయి. ఈ పరిణామంతో అమెరికాలోని న్యూయార్క్, బోస్టన్, చికాగో, వాషింగ్టన్ డీసీ వంటి నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ వెలుపల, న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శనకారులు గుమిగూడారు. ‘ఇరాన్ జోలికి వెళ్లొద్దు’, ‘అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం వద్దు’ వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు మద్దతివ్వడం మానుకోవాలని, ఇరాన్‌తో సంఘర్షణలో జోక్యం చేసుకోవద్దని డిమాండ్ చేశారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను, ఇరాన్‌తో వివాదాన్ని ప్రారంభించినందుకు ఇజ్రాయెల్‌ను కూడా నిరసనకారులు తప్పుపట్టారు.

ఈ యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలకు తోడు, ఇరాన్‌పై వైమానిక దాడుల అనంతరం న్యూయార్క్, వాషింగ్టన్ సహా పలు అమెరికా నగరాలను హై అలర్ట్‌ ప్రకటించారు. ఎటువంటి నిర్దిష్ట లేదా విశ్వసనీయ ముప్పు లేనప్పటికీ, సాంస్కృతిక, దౌత్య, మతపరమైన ప్రదేశాల వద్ద అదనపు పెట్రోలింగ్ ఏర్పాటు చేసి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తెలిపాయి.  

మరోవైపు, అమెరికా దాడులను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీ తీవ్రంగా ఖండించారు. టెహ్రాన్ దీనికి కఠినంగా, నిర్ణయాత్మకంగా బదులిస్తుందని హెచ్చరించారు. ‘జియోనిస్ట్ శత్రువు’ ఒక ‘పెద్ద తప్పు చేసిందని, పెద్ద నేరానికి పాల్పడిందని’ దానికి శిక్ష తప్పదని ఆయన అన్నారు.
Iran
Iran nuclear program
US Iran conflict
Israel
US airstrikes
Ayatollah Ali Khamenei
War protests
Middle East tensions
US foreign policy
Anti war movement

More Telugu News