Nellore Incident: ఫోన్‌ దొంగతనం నెపంతో చిన్నారికి చిత్రహింసలు.. నెల్లూరులో అమానుషం

Minor Girl Tortured in Nellore Suspected of Phone Theft
  • జ్యోతిష్యుడి మాట నమ్మి ఘాతుకం.. బాలిక నాలుక, మూతిపై వాతలు
  • చిన్నారిని హింసించిన మేనత్త, ఇరుగుపొరుగు
  • ఐదుగురిని అరెస్టు చేసి హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. సెల్ ఫోన్ దొంగింలించిందనే అనుమానం, జ్యోతిష్యుడి మాటలు నమ్మి పదేళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేశారు. ఈ అమానుష ఘటన ఇందుకూరుపేట మండలం, కుడితిపాళెం గ్రామం కాకర్లదిబ్బలో వెలుగుచూసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు లేని పదేళ్ల బాలికను ఆమె మేనత్త మాణికల మన్నారి చేరదీసి పెంచుతోంది. ఇటీవల మన్నారి పొరిగింట్లో నివసించే నాగరాజు అనే వ్యక్తి సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. దీంతో ఆయన ఓ జ్యోతిష్యుడిని సంప్రదించగా, ఆ పక్కింట్లో ఉండే బాలికే ఫోన్ దొంగిలించిందని చెప్పాడు.

జ్యోతిష్యుడి మాటలు నమ్మిన నాగరాజు, అతని భార్య సుబ్బమ్మ, చుట్టుపక్కల వారైన శ్రీనివాసులు, సార్ముడమ్మ, బాలిక మేనత్త మన్నారి కలిసి బాలికను నిలదీశారు. ఫోన్‌ ఎక్కడ దాచిందో చెప్పాలంటూ బెదిరించారు. తనకు ఏమీ తెలియదని బాలిక ఎంత చెప్పినా వినకుండా, పొయ్యి దగ్గరకు లాక్కెళ్లి అట్లకాడ కాల్చి బాలిక మూతి, నాలుక, చేతులపై కిరాతకంగా వాతలు పెట్టారు.

ఆదివారం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నాగార్జునరెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన బాలికను వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మూఢనమ్మకాలతో అమాయకులపై దాడులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Nellore Incident
Child Abuse
Phone Theft Accusation
Andukuru Peta
Kuditipalem
Torture
Superstition
Crime News Nellore
Sri Potti Sriramulu Nellore District
Minor Girl

More Telugu News