Donald Trump: 'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్'.. ఇరాన్‌పై అమెరికా దాడి వెనుక మోసపూరిత వ్యూహం

Donald Trumps secret Operation Midnight Hammer against Iran
  • ఇరాన్‌ అణు స్థావరాలపై అమెరికా భారీ వైమానిక దాడి
  • 'ఫేక్-అవుట్' వ్యూహంతో ఇరాన్‌ను తప్పుదారి పట్టించిన అగ్రరాజ్యం
  • బి-2 స్టెల్త్ బాంబర్లు, తొమాహాక్ క్షిపణులతో విరుచుకుపడ్డ అమెరికా
  • తమను గుర్తించలేకపోయిందని, ఇరాన్ పూర్తిగా బోల్తా పడిందని యూఎస్ ప్రకటన
  • అణు కార్యక్రమం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా రక్షణ మంత్రి వెల్లడి
  • దాడి అత్యంత రహస్యం.. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌తో వెలుగులోకి
ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు దిగిన అమెరికా, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా ఒక 'ఫేక్-అవుట్' (మోసపూరిత) వ్యూహాన్ని అమలు చేసింది. ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసే ముందు అమెరికా తన బి-2 బాంబర్లలో కొన్నింటిని పసిఫిక్ దీవి గ్వామ్ వైపు మళ్లించి, అందరి దృష్టినీ తప్పుదారి పట్టించింది. అసలు దాడికి బయలుదేరిన ఏడు బి-2 స్టెల్త్ బాంబర్లు మాత్రం తూర్పు దిశగా 18 గంటల పాటు రహస్యంగా ప్రయాణించి ఇరాన్‌పై విరుచుకుపడ్డాయి. ఈ 'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్' శనివారం ప్రారంభమైనట్లు అమెరికా సైన్యం ఆదివారం వెల్లడించింది.

ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా బాంబర్లు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించకముందే అమెరికా జలాంతర్గామి రెండు డజన్లకు పైగా తొమహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ యుద్ధ విమానాలు, క్షిపణుల నుంచి రక్షణగా అమెరికా ఫైటర్ జెట్‌లు బాంబర్లకు ముందు కవచంగా వెళ్లాయి. ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై బి-2 స్టెల్త్ బాంబర్లు దాడి చేశాయి. ఈ క్రమంలో ఒక్కోటీ 30,000 పౌండ్ల బరువున్న 14 భారీ జిబియు-57 బాంబులను జారవిడిచినట్లు పెంటగాన్ తెలిపింది. మొత్తం 125కు పైగా అమెరికా సైనిక విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

తమ ఆపరేషన్ వ్యూహాత్మకంగా గొప్ప విజయం సాధించిందని, ఇరాన్ సైన్యం ఒక్క తూటా కూడా పేల్చలేకపోయిందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ పెంటగాన్‌లో విలేకరులకు తెలిపారు. "ఇరాన్ ఫైటర్లు గాల్లోకి లేవలేదు, మా రాకను వారి గగనతల రక్షణ వ్యవస్థలు గుర్తించినట్లు కూడా ఆధారాల్లేవు. మేం చివరి వరకు దాడి అంశాన్ని రహస్యంగా ఉంచగలిగాం" అని ఆయన వివరించారు. లక్ష్యంగా చేసుకున్న మూడు అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయని కెయిన్ చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా ధ్వంసమైందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ధీమా వ్యక్తం చేశారు.

'మిడ్‌నైట్ హ్యామర్' ఆపరేషన్‌ను అత్యంత రహస్యంగా ఉంచామని, దీని ప్రణాళిక, సమయం గురించి వాషింగ్టన్‌లో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసని కెయిన్ తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం రాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకు చాలా మంది సీనియర్ అధికారులకు కూడా ఈ విషయం తెలియదని ఆయన అన్నారు. ట్రంప్ ఆదేశిస్తే దాడులకు సిద్ధంగా ఉండేందుకు నెలల తరబడి సన్నాహాలు చేశామని హెగ్సెత్ పేర్కొన్నారు. అయితే, అసలు మిషన్ మాత్రం కొద్ది వారాల్లోనే రూపుదిద్దుకుందని కెయిన్ చెప్పారు. 
Donald Trump
Iran nuclear program
Operation Midnight Hammer
US military operation
Iran
B-2 bomber
Pete Hegseth
Dan Caine
Tomahawk cruise missiles
Middle East tensions

More Telugu News