Jogulamba Gadwal: గద్వాలలో ఘోరం.. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త కోణాలు!

Surveyor Tejeshwar Brutally Murdered in Gadwal Shocking Details
  • పొలం సర్వే పేరుతో కిడ్నాప్, పాణ్యం వద్ద మృతదేహం లభ్యం
  • పెళ్లయి నెల రోజులకే ఘోరం, విషాదంలో కుటుంబ సభ్యులు
  • భార్య, అత్త పాత్రపై తీవ్ర అనుమానాలు, పోలీసుల విచారణ
  • కర్నూలు బ్యాంకు ఉద్యోగి ప్రమేయంపై సోషల్ మీడియాలో కథనాలు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ప్రాజెక్టులు, వ్యవసాయ భూముల సర్వే పనులు చేసే తేజేశ్వర్ (33) అనే లైసెన్స్‌డ్ సర్వేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. సరిగ్గా నెల రోజుల క్రితమే వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తేజేశ్వర్‌ను దుండగులు పొలం సర్వే చేయాలనే నెపంతో పిలిచి, అత్యంత కిరాతకంగా హత్య చేయడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గ‌ద్వాల పట్టణంలోని గంటా వీధికి చెందిన తేజేశ్వర్‌కు జూన్ 17న‌ మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. "ఒక పొలం సర్వే చేయాలి. అర్జెంటుగా రావాలి" అంటూ వారు కోరడంతో పని నిమిత్తం తేజేశ్వర్ బయటకు వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పాటు ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వారి ఆందోళనే నిజమైంది. నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం దొరికింది. ఈ వార్త తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పెళ్లైన నెల రోజులకే విషాదం
వివాహం జరిగి కేవలం నెల రోజులు కూడా గడవకముందే తేజేశ్వర్ ఇలా హత్యకు గురికావడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. "ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నాడు. ఇంతలోనే ఇలా ఏదో కుట్రకు బలైపోయాడు" అంటూ ఆయన స్నేహితులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన వధువుతో సంతోషంగా గడపాల్సిన సమయంలో ఇలా జరగడం అత్యంత బాధాకరం.

భార్య, అత్తపై అనుమానాలు.. బ్యాంకు ఉద్యోగి పాత్ర?
తేజేశ్వర్ హత్య కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మృతుడి భార్య, అత్త ప్రమేయం ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు స‌మాచారం. ఈ మేరకు మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని మృతుడి బంధువులు చెబుతున్నారు. 

అంతేకాకుండా, ఈ హత్య కుట్ర వెనుక కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి ప్రమేయం కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.
Jogulamba Gadwal
Tejeshwar
Gadwal murder
surveyor murder case
Telangana news
bank employee
property dispute
crime news
Nandyala

More Telugu News