Anupama Parameswaran: అనుపమ, సురేశ్ గోపి సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ

Anupama Parameswaran Suresh Gopi Movie Censor Issues
  • సినిమా టైటిల్, పాత్ర పేరు 'జానకి'పై సెన్సార్ బోర్డు అభ్యంతరం
  • టైటిల్, పాత్ర పేరు మార్చాలని చిత్ర యూనిట్‌కు సెన్సార్ బోర్డు సూచన
  • జూన్ 27న విడుదల కావాల్సిన సినిమాకు సర్టిఫికెట్ నిలిపివేత
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు, అనుపమ పోషిస్తున్న ప్రధాన పాత్ర పేరు ‘జానకి’పై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ పరిణామం మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జానకి అనే ఓ మహిళ సాగించే న్యాయ పోరాటం నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. అయితే, సీతాదేవికి మరో పేరైన 'జానకి' అనే పేరును లైంగిక దాడికి గురైన మహిళ పాత్రకు పెట్టడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు ప్రవీణ్ నారాయణ్ కూడా ధృవీకరించారు. సినిమా ప్రదర్శనకు సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించిందని ఆయన వెల్లడించారు.

ఈ అంశంపై ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్ విలేకరులతో మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. సినిమాలో ‘జానకి’ అనే పేరును వాడకూడదని సెన్సార్ బోర్డు చిత్ర నిర్మాతలకు స్పష్టంగా తెలిపిందని ఆయన అన్నారు. సినిమా టైటిల్‌తో పాటు, ప్రధాన పాత్ర పేరును కూడా మార్చాలని బోర్డు సూచించిందని ఉన్ని కృష్ణన్ వివరించారు. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరు పెట్టడం తగదని బోర్డు భావించినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో మరో మలయాళ సినిమా విషయంలోనూ ఇలాంటి సమస్యే తలెత్తిందని, అప్పుడు ‘జానకి’ అనే పేరును ‘జయంతి’గా మార్చి సెన్సార్ సర్టిఫికెట్ పొందారని ఆయన గుర్తుచేశారు.

‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ జానకి పాత్రలో కనిపించనుండగా, సురేశ్ గోపి న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు. "సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది" అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం మొదట ప్లాన్ చేసింది. అయితే, తాజా సెన్సార్ పరిణామాల నేపథ్యంలో సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సెన్సార్ బోర్డు సూచనల మేరకు టైటిల్, పాత్ర పేరు మార్పులపై చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 
Anupama Parameswaran
Janaki vs State of Kerala
Suresh Gopi
Malayalam Movie
Censor Board
Film Employees Federation of Kerala
FEFKA
Praveen Narayanan
Unni Krishnan
Malayalam Cinema

More Telugu News