China: అమెరికా అటాక్ ను ఖండించిన చైనా

China Condemns US Attack on Iran Nuclear Sites
  • ఇరాన్ పై దాడి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని వ్యాఖ్య
  • మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెంచొద్దంటూ హితవు
  • ఇజ్రాయెల్ తక్షణమే కాల్పులు ఆపాలని డ్రాగన్ డిమాండ్
ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను చైనా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఈ దాడులు మరింత తీవ్రతరం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.

"అమెరికా తీసుకున్న ఈ చర్య ఐక్యరాజ్యసమితి (ఐరాస) చార్టర్ నిర్దేశించిన లక్ష్యాలను, సూత్రాలను, అలాగే అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోంది. ఇది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింతగా పెంచుతుంది" అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ తరహా ఏకపక్ష దాడులు ఆమోదయోగ్యం కావని చైనా స్పష్టం చేసింది.

వీలైనంత త్వరగా కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్ కు చైనా పిలుపునిచ్చింది. శాంతియుత చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం కనుగొనాలని, సంయమనం పాటించాలని ఇరు వర్గాలకు సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చైనా కోరింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడుల అనంతరం చైనా నుంచి వెలువడిన తొలి అధికారిక స్పందన ఇదే కావడం గమనార్హం.
China
Iran nuclear program
US attack
Middle East tensions
Israel
United Nations
Ceasefire

More Telugu News