Madhavi Reddy: కడపలో కబ్జా.. వైసీపీ కార్పొరేటర్‌కు ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీవ్ర హెచ్చరిక

Madhavi Reddy Warns YSRCP Corporator Over Land Grabbing in Kadapa
  • కడపలో వైసీపీ కార్పొరేటర్ అక్బర్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారన్న మాధవి రెడ్డి 
  • నాలుగో డివిజన్‌లో రోడ్డు, పేవ్‌మెంట్‌పై అక్రమంగా గదుల నిర్మాణం
  • కాలువను కప్పివేసి, అవినాశ్ రెడ్డి, జగన్ నిధులతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారని విమర్శ
  • వారం రోజుల్లో ఆక్రమణలు తొలగించకపోతే బుల్డోజర్‌తో కూల్చివేస్తామని తీవ్ర హెచ్చరిక
  • సదరు కార్పొరేటర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్
కడప నగరంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ కార్పొరేటర్ ఒకరు ప్రభుత్వ స్థలాన్ని యథేచ్ఛగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ఆమె ఆరోపించారు. వారం రోజుల్లోగా ఆక్రమణలు తొలగించకపోతే బుల్డోజర్‌తో కూల్చివేస్తామని, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయిస్తామని గట్టిగా హెచ్చరించారు.

వివరాల్లోకి వెళితే, కడప నగరంలోని నాలుగో డివిజన్ పరిధిలో, మెయిన్ రోడ్డుకు లోపల వైపున ఉన్న ప్రభుత్వ రోడ్డు, పేవ్‌మెంట్‌ను ఆక్రమించుకుని 34వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అక్బర్ అక్రమంగా గదులు నిర్మించుకున్నారని ఎమ్మెల్యే మాధవి రెడ్డి తెలిపారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ, ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలా ప్రభుత్వ స్థలాలనే కబ్జా చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. "ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. కార్పొరేటర్ మనుషులే ఇక్కడ పనులు చేస్తున్నారు. వారం రోజుల్లోగా కార్పొరేటర్ ఈ నిర్మాణాలను స్వయంగా తొలగించాలి. లేకపోతే బుల్డోజర్ తీసుకువచ్చి మేమే కూల్చివేస్తాం. అక్బర్‌పై కచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం" అని ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్పష్టం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గెలిచిన కార్పొరేటర్ల పరిస్థితి ఇదని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. "చిన్న వాళ్లు, పేదవాళ్లు ఎక్కడైనా తమ సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే, ఏమాత్రం నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు వచ్చి ఇళ్లు కూల్చేస్తారు. కానీ, ఒక కార్పొరేటర్ ఏకంగా ప్రభుత్వ రోడ్డుపైనే శాశ్వత ఆఫీసు నిర్మించుకున్నా పట్టించుకోలేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే ప్రాంతంలో, రోడ్డు పక్కన ఉన్న కాలువను పూర్తిగా మూసివేసి, ఆ కాలువ స్థలంలో వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల నిధులతో అంటూ ఒక ఆర్వో వాటర్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటుచేసి ఆక్రమించుకున్నారని ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆరోపించారు. "ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం ఒక ఎత్తు అయితే, అసలు ప్రభుత్వ రోడ్లను, కాలువలను ఆక్రమించుకునే హక్కు వీరికి ఎవరిచ్చారు? తమ గదుల నిర్మాణం కోసం కాలువలను కూడా పక్కకు జరిపేశారు. ప్రజల ఆస్తులు దోచుకోవడానికేనా వీరిని గెలిపించేది?" అంటూ  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
Madhavi Reddy
Kadapa
YSRCP
land grabbing
encroachment
Akbar
YS Avinash Reddy
Jaganmohan Reddy
government lands
illegal construction

More Telugu News