Sri Ram: డ్రగ్స్ కేసులో సినీ హీరో శ్రీరామ్ అరెస్ట్

Kollywood Actor Sri Ram Arrested in Drug Case
  • చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసుల అదుపులో నటుడు
  • మాజీ ఏఐఏడీఎంకే నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు
  • శ్రీరామ్‌కు వైద్య పరీక్షలు, రెండు గంటలకు పైగా విచారణ
కోలీవుడ్ హీరో శ్రీరామ్ మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ కావడం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన ఆయనను చెన్నై పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. ఏఐఏడీఎంకే మాజీ నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ అరెస్ట్ జరిగింది.

వివరాల్లోకి వెళితే, చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటుడు శ్రీరామ్‌ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆయనను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ శ్రీరామ్ రక్త నమూనాలను సేకరించినట్లు సమాచారం. ఆ తర్వాత నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించి సుమారు రెండు గంటల పాటు అధికారులు ఆయన్ను విచారించారు.

ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించినప్పుడు లభించిన సమాచారం ఆధారంగా నటుడు శ్రీరామ్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

తిరుపతికి చెందిన శ్రీకాంత్, సినిమాల్లో అవకాశాల కోసం చిన్న వయసులోనే చెన్నైకి వెళ్లారు. అక్కడ తన పేరును శ్రీరామ్‌గా మార్చుకుని, తొలుత చిన్న పాత్రలు పోషించారు. 'రోజా పూలు' సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'ఒకరికి ఒకరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. ఇటీవలే 'హరికథ' అనే వెబ్ సిరీస్‌లో కూడా శ్రీరామ్ కనిపించారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో, విజయ్ హీరోగా వచ్చిన 'స్నేహితులు' చిత్రంలో జీవాతో కలిసి శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం శ్రీరామ్ అరెస్ట్ వార్త చెన్నై సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
Sri Ram
Kollywood
drugs case
Chennai police
AIADMK Prasad
Tamil cinema
Telugu cinema
Harikatha web series
Snehithulu movie
drug trafficking

More Telugu News