Jagan Mohan Reddy: సింగయ్య మృతి వ్యవహారంపై తొలిసారిగా స్పందించిన జగన్

Jagan Reddy Responds to Singayya Death Controversy
  • చంద్రబాబు రాజకీయాలను దిగజార్చారంటూ జగన్ ఫైర్
  • నా పర్యటనకు ఆంక్షలెందుకు? అంటూ నిలదీత
  • ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లింపుకే కుట్రలు అంటూ ఆరోపణ
  • మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచామని వెల్లడి
  • మీ పర్యటనల్లో మరణిస్తే మీరేం చేశారు? అంటూ చంద్రబాబుకు సూటి ప్రశ్న
పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి తీవ్ర వివాదాస్పదం అయిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన తీరుతో రాజకీయాలను మరింత దిగజార్చారని ఆరోపిస్తూ, పలు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తన పర్యటనలపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని, కార్యకర్తలు తనను కలవకుండా ఎందుకు కట్టడి చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. "గతంలో మీరు గానీ, మీ మిత్రుడు పవన్ కల్యాణ్ గానీ పర్యటనలు చేసినప్పుడు మేమెప్పుడైనా ఇలాంటి ఆంక్షలు విధించామా?" అని నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం, రైతులు, ప్రజలకు సంఘీభావం తెలపడం తప్పా అని ప్రశ్నించారు.

జడ్ ప్లస్ కేటగిరీ భద్రత అనేది మాజీ ముఖ్యమంత్రులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని తమకు నచ్చినప్పుడు ఉపసంహరించుకునే అధికారం ఏ ప్రభుత్వానికీ ఉండదని జగన్ స్పష్టం చేశారు. "మీకు మూడ్ వచ్చినప్పుడు భద్రత ఇస్తాం, లేనప్పుడు ఉపసంహరించుకుంటాం అనడానికి ఇది మీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండదు. ఇది నాకైనా, మీకైనా వర్తించే ప్రోటోకాల్" అని స్పష్టం చేశారు. జడ్ ప్లస్ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి పర్యటన గురించి ముందుగానే సమాచారం ఇచ్చిన తర్వాత, అందుకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని గుర్తుచేశారు.

తన పర్యటన సందర్భంగా రూట్ మ్యాప్ ఇచ్చినప్పటికీ, పైలట్ వాహనాలు, రోప్ పార్టీలు వంటి భద్రతా ఏర్పాట్లు ఎందుకు కొరవడ్డాయని జగన్ ప్రశ్నించారు. "జనం ఎక్కువగా ఉన్నప్పుడు, జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ రోప్ పార్టీ ఉండాల్సిన అవసరం లేదా? ఒకవేళ భద్రత కల్పించి ఉంటే, వాహనం కింద మనుషులు ఎలా పడగలుగుతారు? మీరు భద్రత కల్పించలేదన్నది నిజమా, లేక వాహనం కింద ఎవరూ పడలేదన్నది నిజమా?" అని ఆయన నిలదీశారు.

జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ప్రభుత్వ డ్రైవర్‌ను కేటాయించడం కూడా ప్రోటోకాల్‌లో భాగమేనని జగన్ తెలిపారు. "మీరు సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకపోతే, ప్రభుత్వ అనుమతితో నా సొంత డబ్బుతో వాహనం కొనుక్కున్నాను. డ్రైవర్‌ను మీరే ఇచ్చారు. మరి మీ ప్రభుత్వ డ్రైవర్ నడుపుతున్న వాహనానికి, మీరు ఏర్పాటు చేయాల్సిన పైలట్, రోప్ పార్టీల భద్రతా ఏర్పాట్లకు మీదే కదా బాధ్యత?" అని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆరోజు ఎస్పీ ఇచ్చిన స్టేట్‌మెంట్ సంగతి ఏమిటని కూడా జగన్ ప్రస్తావించారు. 

ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఇటువంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. "గతంలో మీరు ఇచ్చిన హామీలు, బాండ్లు, మేనిఫెస్టోలోని అబద్ధాలు, మోసాలను నేను ప్రెస్ మీట్ పెట్టి బయటపెట్టాను. మీ పాలనా వైఫల్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, ఖజానాకు జరుగుతున్న నష్టం, రైతులు, అక్కచెల్లెమ్మలు, పిల్లల బతుకులు అతలాకుతలం అవుతున్న తీరును ఎత్తిచూపితే, వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీపై ఉన్న వ్యతిరేకతను, నాపై ఉన్న ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు మరింత దిగజారి డైవర్షన్ రాజకీయాలు చేయడం హేయమైన చర్య" అని జగన్ విమర్శించారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని మారాలని హితవు పలికారు.

సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు జరిగిన దురదృష్టకర ఘటన తన దృష్టికి వచ్చిందని జగన్ తెలిపారు. "వెంటనే మా పార్టీ ప్రత్తిపాడు ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఇతర నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని తెలిసింది. మరుసటి రోజు నేను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించాను. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబానికి చేతనైనంత సహాయం చేయడం మా బాధ్యత. మరణించిన వ్యక్తి మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత పెరుగుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటుతో మరణించిన మరో అభిమాని విషయంలోనూ ఇలాగే స్పందించాం. అయినా మాపై విషప్రచారం చేస్తున్నారు. మానవత్వం, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం" అని జగన్ అన్నారు.

"చంద్రబాబు గారూ, మీ పర్యటనలు, మీటింగులలో చనిపోయిన వారి విషయంలో మీరేం చేశారు? ఎంత చేశారు? మీరా మానవత్వం, నైతికత గురించి మాట్లాడేది? ఇప్పటికైనా మారండి!" అంటూ జగన్ తన ప్రశ్నలను ముగించారు.
Jagan Mohan Reddy
Singayya death
Chandrababu Naidu
YS Jagan
Andhra Pradesh politics
security protocol
J plus security
political allegations
YS Jagan tour
diversion politics

More Telugu News