Kanta Rao: కష్టాల్లో కాంతారావు ఫ్యామిలీ .. ఆదుకునేదెవరు?

Kantharao Special
  • కష్టాల్లో ఉన్న కాంతారావు ఫ్యామిలీ 
  • చిన్న గదిలో అద్దెకి ఉంటున్న కూతురు 
  • అద్దె కట్టలేని స్థితిలో కాంతారావు తనయుడు
  • సాయం కోసం ఎదురుచూపులు  
  • ఇది ఆదుకోవలసిన సమయం

కాంతారావు .. తెలుగు జానపదాలు ఎంచుకున్న కథానాయకుడు. తెలంగాణ ప్రాంతం నుంచి కదిలిన తొలి కథానాయకుడు. ఎన్టీఆర్ - ఏఎన్నార్ తరువాత స్థానంలో, ఇప్పటికీ చెప్పుకుంటున్న మేటి నటుడు ఆయన. తెలుగు తెర రాకుమారుడు అనిపించుకున్న కాంతారావు, తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. నటుడిగా సక్సెస్ అయిన ఆయన, నిర్మాతగా మాత్రం సక్సెస్ ను అందుకోలేకపోయారు. మంచితనానికీ .. అమాయకత్వానికి మధ్యలోని సన్నని గీతని అర్థం చేసుకోలేక ఆయన ఆర్ధికంగా చితికిపోయారు.

లంకంత ఇంటిలో నుంచి కాంతారావు చిన్న ఇంట్లోకి మారారు. సీరియల్స్ లో తనకి వచ్చిన చిన్న పాత్రలనే చేస్తూ వెళ్లారు. వచ్చిన దాంట్లోనే సర్దుకుంటూ తన భార్యను పోషిస్తూ వెళ్లారు. ఆ తరువాత అనారోగ్య కారణాలతో .. ఆర్ధిక పరమైన ఇబ్బందులతో సతమతమైపోయారు. పరిస్థితులతో పోరాడలేక అలసిపోయిన ఆయన, అసంతృప్తితోనే కన్ను మూశారు. కాంతారావుకి ఎవరెవరు సాయం చేశారు? ఎంత సాయం చేశారు? అనే ప్రశ్న సంగతి అలా ఉంచితే, ఆ సాయాలేవీ బ్రతికుండగా ఆయన పరిస్థితిని మార్చలేకపోయాయి. 

ఇక ఇప్పుడు ఒక వైపున కొడుకు .. మరో వైపున కాంతారావు కూతురు ఇద్దరూ ఆర్ధికంగా చాలా సమస్యలతో ఉన్నారు. కాంతారావు కూతురు ఓ చిన్నగదిలో అద్దెకి ఉంటే, ఆయన కొడుకు రాజేశ్వరరావు అద్దె కూడా కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆయనకి యండమూరి వీరేంద్రనాథ్ లక్ష రూపాయాల సాయం అందించడంతో ఈ విషయం బయటికి వచ్చింది. కాంతారావును అభిమానించే వారందరికీ ఇది బాధ కలిగించే విషయం. 

కాంతరావు బ్రతికి ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలు కొందరు సాయం చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీని ఆదుకోవలసిన బాధ్యతను కూడా ఇండస్ట్రీ తీసుకుంటే బాగుంటుంది. ఎక్కడో వరదలు వస్తేనే .. ఎవరో తెలియని తుపాను బాధితుల కోసం కోట్ల రూపాయలు ఇండస్ట్రీ నుంచి విరాళంగా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. హీరోలుగా .. దర్శక నిర్మాతలుగా ఎంతోమంది దిగ్గజాలు ఉన్న ఇండస్ట్రీ, ఒకసారి కాంతారావు ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడవలసిన అవసరం ఉంది. ఇక ఇండస్ట్రీతో సంబంధం లేనివారు సైతం ఆ ఫ్యామిలీకి సాయాన్ని అందించవచ్చు. కళాకారుల కుటుంబం కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకోవడమే కళామతల్లికి ఇచ్చే అసలైన నీరాజనం. 

Kanta Rao
Telugu actor
Tollywood
Yandamuri Veerendranath
Telugu cinema
financial crisis
Telugu film industry
Rajeshwara Rao
charity
film actor

More Telugu News