Raja Singh: బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు... తీవ్రంగా స్పందించిన రాజాసింగ్

Raja Singh Reacts Strongly to BRS Comments on Bandi Sanjay
  • కాళేశ్వరంపై ఇవిగో ఆధారాలు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు
  •  బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతల విమర్శలు
  • బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండించిన రాజాసింగ్
  • కాళేశ్వరం కచ్చితంగా అవినీతి ప్రాజెక్టేనని రాజాసింగ్ స్పష్టం
  • బీఆర్ఎస్ కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకుందన్న మోదీ వ్యాఖ్యలు వాస్తవమేనని వెల్లడి
  • ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచారని తీవ్ర విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతి గురించి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా వివరాలు వెల్లడించగానే, బీఆర్ఎస్ నాయకులు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నూటికి నూరు శాతం అవినీతిమయమైన ప్రాజెక్టేనని ఆయన పునరుద్ఘాటించారు.

"కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మా పార్టీది, మా అందరిదీ ఒకే మాట. ఈ ప్రాజెక్టు అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలో చేసిన వ్యాఖ్యలకే మేము కట్టుబడి ఉన్నాం" అని రాజాసింగ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుల తీరు చూస్తుంటే 'దొంగే దొంగ అన్నట్లుగా' ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రధాని మోదీ చెప్పినట్లుగా, బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తమ ఏటీఎంగా మార్చుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. "కేవలం రూ.8 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో ఏకంగా రూ.1.20 లక్షల కోట్లకు పెంచిన మాట వాస్తవం కాదా?" అని నిలదీశారు.

అప్పట్లో కేసీఆర్ తనకు తానే ఇంజినీర్‌గా ప్రకటించుకుని కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. ఇప్పుడు ఆయన కుమారుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) కంటే తానే గొప్ప మేధావి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం బీఆర్ఎస్ నేతల ఓటమికి నిదర్శనమని ఆయన అన్నారు.
Raja Singh
Bandi Sanjay
BRS
Kaleshwaram Project
Telangana
Corruption
Narendra Modi
Amit Shah
BJP
KCR

More Telugu News