Arvind Kejriwal: ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్

Arvind Kejriwal Responds to Rajya Sabha Rumors
  • రాజ్యసభకు వెళుతున్నానన్న ప్రచారాన్ని ఖండించిన కేజ్రీవాల్
  • ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానంపై పార్టీ కమిటీదే తుది నిర్ణయమని వెల్లడి
  • గుజరాత్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయంపై కేజ్రీవాల్ హర్షం
తాను రాజ్యసభకు వెళుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అటువంటిదేమీ లేదని, తాను పెద్దల సభకు వెళ్లడం లేదని ఆయన తేల్చి చెప్పారు. పంజాబ్‌లోని లుథియానా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోడా గెలుపొందారు.

దీంతో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే, ఆ ఖాళీ అయ్యే స్థానం నుంచి కేజ్రీవాల్ రాజ్యసభలో అడుగుపెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖాళీ అయ్యే రాజ్యసభ సీటుకు ఎవరు పోటీ చేయాలనేది పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.

గుజరాత్ ప్రజల చూపు మావైపే!

గుజరాత్‌లోని విశావదర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం పట్ల కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయారని, ఇప్పుడు వారంతా తమ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. గుజరాత్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, విశావదర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి, మరో స్థానంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్, గుజరాత్ ఎన్నికల్లో తమ పార్టీని ఓడించడానికి బీజేపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా ప్రజలు వారిని తిరస్కరించారని ఆరోపించారు. లుథియానా పశ్చిమ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించడం ద్వారా పంజాబ్ ప్రజలు తమ ప్రభుత్వ పనితీరుకు మద్దతు తెలిపారని ఆయన అన్నారు. గుజరాత్‌లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ ఉందని, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి కీలుబొమ్మగా మారిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
Arvind Kejriwal
AAP
Rajya Sabha
Aam Aadmi Party
Delhi CM
Punjab Elections
Gujarat Elections

More Telugu News