Akhilesh Yadav: పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను బహిష్కరించిన అఖిలేశ్ యాదవ్

Akhilesh Yadav Expels Three MLAs From Samajwadi Party
  • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు
  • జీజేపీతో సంబంధాలు ఉన్నాయంటూ వేటు
  • రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ముగ్గురు సిట్టింగ్ శాసనసభ్యులను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు, బీజేపీతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయని ఎస్పీ తీవ్ర ఆరోపణలు చేసింది.

వివరాల్లోకి వెళితే, గోసాయిగంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభయ్ సింగ్, గౌరీగంజ్‌ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్, ఉంచహార్‌ శాసనసభ్యుడు మనోజ్ కుమార్ పాండేలను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు సమాజ్‌వాదీ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, మత ప్రాతిపదికన ప్రజలను విభజించే భావజాలం కలిగిన పార్టీతో చేతులు కలిపారని ఎస్పీ తన ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించింది.

తమ రాజకీయ వైఖరిని సరిదిద్దుకోవడానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు తగినంత సమయం ఇచ్చామని, అయినప్పటికీ వారిలో మార్పు రాలేదని పార్టీ అధిష్ఠానం పేర్కొంది. ఈ నేపథ్యంలో, పార్టీ ప్రయోజనాలను, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వీరిని బహిష్కరించడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది.

2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి, బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేశారని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అప్పటి నుంచే వీరిపై పార్టీ నాయకత్వం గుర్రుగా ఉందని, సరైన సమయంలో చర్యలు తీసుకుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. తాజా నిర్ణయంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఈ పరిణామం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 
Akhilesh Yadav
Samajwadi Party
Uttar Pradesh Politics
MLA Expulsion
Abhay Singh
Rakesh Pratap Singh
Manoj Kumar Pandey
BJP
Rajya Sabha Elections
Political News

More Telugu News