Israel Iran conflict: ఇజ్రాయెల్ దాడుల్లో మృతుల సంఖ్య 500కు చేరింది: ఇరాన్ మీడియా

Israel Iran Conflict Death Toll Reaches 500 Iran Media
  • ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్ లో భారీగా మరణాలు
  • మృతుల సంఖ్య రెట్టింపు ఉండవచ్చంటున్న మానవ హక్కుల సంస్థలు
  • అంతర్జాతీయ మీడియా సంస్థలపై ఇరాన్ ఆంక్షలు
ఇరాన్‌పై ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దాడుల కారణంగా మృతుల సంఖ్య 500కు చేరిందని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో సుమారు మూడు వేల మంది గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. జూన్ 13వ తేదీ నుంచి ఇజ్రాయిల్, ఇరాన్‌పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.

అంతర్జాతీయ మీడియా సంస్థలపై ఇరాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో, ఆ దేశంలోకి ప్రవేశించడం అనేక వార్తా సంస్థలకు సాధ్యపడటం లేదు. దీంతో, ఇజ్రాయిల్ దాడుల వల్ల జరిగిన వాస్తవ నష్టంపై స్పష్టమైన అంచనాకు రావడం కష్టతరంగా మారింది. అయితే, ఇరాన్‌లో పనిచేస్తున్న మానవ హక్కుల సంస్థలు మాత్రం మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే రెట్టింపుగా ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ గగనతలంలోకి వాణిజ్య విమానాలు ప్రవేశించడం లేదు. తాజా సమాచారం ప్రకారం, ఇరాన్‌తో పాటు ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్ గగనతలాలను కూడా వాణిజ్య విమానయాన సంస్థలు పూర్తిగా దూరం పెట్టినట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం సుమారు 120 విమానాలు ఆలస్యంగా నడిచాయి. జోర్డాన్‌లోని క్వీన్ అలియా అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 40 శాతం విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ దుబాయ్‌కి వెళ్లే తమ విమానాలను జూలై 3వ తేదీ వరకు రద్దు చేయగా, బ్రిటీష్ ఎయిర్‌వేస్ కూడా దుబాయ్, దోహాలకు తమ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Israel Iran conflict
Iran Israel war
Israel attacks Iran
Iran death toll
Middle East tensions
Iran air space
Dubai airport flights
Queen Alia International Airport
United Airlines
British Airways

More Telugu News