Nara Lokesh: రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన నారా లోకేశ్

Nara Lokesh Thanks Revanth Reddy
  • ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు
  • రూ.1.35 కోట్లతో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పనులు
  • హర్ష్యం వ్యక్తం చేసిన నారా లోకేశ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మృతివనమైన ఎన్టీఆర్ ఘాట్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని లోకేశ్ పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో రూ.1.35 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ ఘాట్‌లో మరమ్మతు పనులు చేపట్టడాన్ని ఆయన స్వాగతించారు. 

"తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం, తెలుగు జాతి వెలుగు సంతకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహానాయకుడు ఎన్టీఆర్ స్మృతివనం అయిన ఎన్టీఆర్ ఘాట్‌కు రూ.1.35 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ మరమ్మతులు చేపట్టడం చాలా సంతోషం. ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని నారా లోకేశ్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.
Nara Lokesh
Revanth Reddy
NTR Ghat
Andhra Pradesh
Telangana
Nandamuri Taraka Ramarao
Hyderabad
HMDA
Political News

More Telugu News