Sajjala Ramakrishna Reddy: ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాదే గెలుపు: సజ్జల

Sajjala Ramakrishna Reddy Confident of YSRCP Victory in Andhra Pradesh Elections
  • కూటమి ప్రభుత్వం కక్షసాధింపులు, తప్పుడు కేసులతో వేధిస్తోందని ఆరోపణ
  • చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని విమర్శ
  • రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధిస్తుందని, ఈ విషయంపై ప్రజల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ బలమైన నమ్మకం ఉందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తూ, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ, వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. 'రెడ్‌బుక్‌ రాజ్యాంగం' అంటూ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ప్రజల మద్దతు తమకే ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాల అమలును పూర్తిగా విస్మరించారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. సామాన్యులు కూడా దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారని, పాలన పూర్తిగా గాడి తప్పిందని అన్నారు.

మళ్లీ గెలవలేమన్న భయంతో కూటమి నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. ఈ ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం 1.67 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని తెలిపారు. అమరావతిలో ఇప్పటికే ఉన్న 40 వేల ఎకరాలకు అదనంగా మరో 40 వేల ఎకరాల భూములను లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరుతో నేరుగా పది శాతం కమీషన్‌ తీసుకుంటూ వేల కోట్లు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు, కోరికలతో సంబంధం లేకుండా పాలన సాగుతోందని, కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై ప్రజలే నిలదీసేలా వైసీపీ కార్యాచరణ ఉండాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం 18 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు సిద్ధమవుతారని, టెక్నాలజీని ఉపయోగించుకుని పార్టీ వాయిస్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 
Sajjala Ramakrishna Reddy
YSRCP
Andhra Pradesh Elections
TDP
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Welfare Schemes
Loan
Amaravati Land
Political Corruption

More Telugu News