Chandrababu Naidu: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు: చంద్రబాబు

Chandrababu Naidu No Loss to Anyone with Godavari Banakacherla Project
  • ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి 
  • సుపరిపాలనలో తొలి అడుగు పేరిట కార్యక్రమం
  • ప్రసంగించిన సీఎం చంద్రబాబు
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం అమరావతి సచివాలయం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సుపరిపాలన తొలిఅడుగు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్న బనకచర్ల ప్రాజెక్టు ప్రస్తావన తెచ్చారు. ఈ ప్రాజెక్టుతో ఎవరికీ ఇబ్బంది లేదని అన్నారు. 

"గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది ఉండదు. తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లను రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. 3000 టీఎంసీలు నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇందులో కొంత మొత్తం వాడుకున్నా... తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుంది" అని స్పష్టం చేశారు.

ఇక, రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి రాజకీయ పాలన (పొలిటికల్ గవర్నెన్స్)తోనే సాధ్యమవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో, ఒక కుటుంబంలా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. యోగా దినోత్సవ స్ఫూర్తితో ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామని, 2029, 2047 సంవత్సరాలను ఉమ్మడి లక్ష్యాలుగా నిర్దేశించుకోవాలని సూచించారు.

ఏడాది పాలన - ప్రజల ఆకాంక్షలే లక్ష్యం

ప్రజలు తమపై ఉంచిన నమ్మకంతోనే కూటమి ప్రభుత్వం 94 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించిందని చంద్రబాబు అన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉందని గుర్తుచేశారు. "డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నాం. కేంద్రం సహకారం లేకుంటే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి ఉండేది. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతామని, పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు మాటిచ్చాం. ఏడాదిలోనే అన్నీ చేశామని మేం చెప్పడం లేదు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశాం" అని ముఖ్యమంత్రి వివరించారు. తాను క్లిష్టమైన సమయంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, గతంలో 1995, 2014లలో కూడా ఆర్థిక సవాళ్లను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని గుర్తు చేశారు.

గత పాలనపై విమర్శలు - రాష్ట్ర పునర్నిర్మాణం

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని ముఖ్యమంత్రి విమర్శించారు. "గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు వెళ్లిపోయారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పోయింది. యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు. శాంతిభద్రతలు దెబ్బతీశారు. మూడు రాజధానులంటూ ఐదేళ్లు మూడు ముక్కలాట ఆడారు" అని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన ఉందా అనే అనుమానం కలిగించారని, రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని అన్నారు. సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి సంక్షేమం అమలు చేస్తామంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం

సంక్షేమం, సాధికారత, పెట్టుబడుల సాధన, సంపద సృష్టి, ఆదాయం పెంచడం అనే నాలుగింటినీ సమానంగా తీసుకెళ్తేనే ఆర్థిక వ్యవస్థ మనుగడ సాధిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే నాలుగు కీలక హామీలపై సంతకాలు చేశామని, 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తెచ్చామన్నారు. పెన్షన్లు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా అందిస్తున్నామని, గత ప్రభుత్వం మూసేసిన అన్నక్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు.

పెట్టుబడుల ఆకర్షణ - ఉపాధి కల్పన

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పెట్టుబడులు కీలకమని, వెనుకబడిన నియోజకవర్గాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. "ఇప్పటి వరకు రూ. 9.34 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం, దీని ద్వారా 8.50 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. 33 పెట్టుబడి పాలసీలు తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం మనదే" అని వివరించారు. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా పయనిస్తున్నామని అన్నారు.

విజన్ 2047 దిశగా పదేళ్ల ప్రణాళిక

2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని చంద్రబాబు ఉద్ఘాటించారు. "విజన్ 2020ని నిజం చేశాం, ఇప్పుడు విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తున్నాం. దీనికోసం పది సూత్రాలను రూపొందించుకున్నాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే మా ధ్యేయం" అని తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో అందరికీ ఇళ్లు కట్టిస్తామని, జల్ జీవన్ మిషన్ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఐఏఎస్ అధికారులు ‘బంగారు కుటుంబాల’ను దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేయాలని, 15 శాతం వృద్ధి రేటు సాధించాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Godavari Banakacherla project
Telugu states
AP development
Investment agreements
Pawan Kalyan
Vision 2047
AP economy
Job creation

More Telugu News