Bilawal Bhutto: సింధు జలాలపై భారత్‌తో యుద్ధమే.. బిలావల్ భుట్టో సంచలన వ్యాఖ్యలు

Bilawal Bhutto Threatens War if India Stops Sindh River Water
  • సింధు జలాల ఒప్పందం రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన పాక్ నేత
  • ఉగ్రవాదాన్ని భారత్ రాజకీయంగా వాడుకుంటోందని ఆరోపణ
  • ఎఫ్ఏటీఎఫ్ విషయంలో పాక్ పురోగతికి భారత్ అడ్డుపుల్ల వేసిందని ఆగ్రహం
సింధు నదీ జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) కింద తమ దేశానికి రావాల్సిన నీటి వాటాను భారత్ నిరాకరిస్తే, యుద్ధానికి దిగడానికైనా వెనుకాడబోమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో హెచ్చరించారు. సోమవారం పాకిస్థాన్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ భారత్ కనుక నీటిని ఆపే చర్యలకు పాల్పడితే తాము మళ్లీ యుద్ధం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ చర్య చట్టవిరుద్ధమని, దీనిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.

సింధు నదీ పరీవాహక ప్రాంతంలోని ఆరు నదులను ప్రస్తావిస్తూ.. భారత్‌కు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని భుట్టో పేర్కొన్నారు. నీటిని న్యాయంగా పంచుకోవాలని, లేదా ఆరు నదుల నుంచీ తామే నీటిని తెచ్చుకుంటామని పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందం ముగిసిపోయిందని, అది నిలిచిపోయిందని భారత్ చెప్పడం సరికాదని, ఇది చట్ట విరుద్ధమని చెప్పారు. ఎందుకంటే సింధు జలాల ఒప్పందం నిలిచిపోలేదన్నారు. నీటిని ఆపేస్తామనే బెదిరింపు ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం కూడా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

భారత్ చర్చలకు నిరాకరిస్తే హింస మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించిన బిలావల్.. ఉగ్రవాదాన్ని భారత్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) విషయంలో పాకిస్థాన్ సాధించిన పురోగతిని దెబ్బతీయడానికి భారత్ దౌత్యపరంగా ప్రయత్నించిందని మండిపడ్డారు.

కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు అంతర్జాతీయ మద్దతు లభిస్తోందని, ఈ అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా లేవనెత్తడంలో పాకిస్థాన్ విజయం సాధించిందని బిలావల్ తెలిపారు. ఈ వివాదంపై మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖత వ్యక్తం చేయడాన్ని ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు.
Bilawal Bhutto
Indus Waters Treaty
Pakistan
India
Water Dispute
Kashmir
FATF
UN Charter
Water Sharing
Sindh River

More Telugu News