Anakapalli Road Accident: వాహనాలపై దూసుకువెళ్లిన లారీ .. ముగ్గురు మృతి, 16 మందికి గాయాలు

Anakapalli Road Accident Lorry Rams Vehicles Three Dead
  • అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం కూడలి వద్ద ఘటన
  • కూడలి వద్ద సిగ్నల్ పడటంతో ఆగి ఉన్న వాహనాలపై దూసుకుపోయిన లారీ
  • క్షతగాత్రులు అనకాపల్లి, అగనంపూడి ఆసుపత్రులకు తరలింపు
అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకుపోవడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, జాతీయ రహదారిపై పరవాడ మండలం లంకెలపాలెం కూడలి వద్ద సిగ్నల్ పడటంతో వాహనాలు నిలిచి ఉన్నాయి. గాజువాక నుంచి అనకాపల్లి వైపు అతి వేగంగా వస్తున్న లారీ, ముందుగా ఆగి ఉన్న మూడు కార్లు, పది వరకు ద్విచక్ర వాహనాలను ఢీకొంటూ ముందుకు సాగింది. అదే సమయంలో పరవాడ వైపు వెళ్తున్న కంటెయినర్ లారీని ఢీకొట్టి ఆగింది.

ఈ ప్రమాదంలో అనకాపల్లి మండలం రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ (52), విశాఖ జిల్లా అగనంపూడికి చెందిన యర్రప్పడు (30), అనకాపల్లికి చెందిన కొణతాల అచ్చయ్యనాయుడు (55) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 16 మందిలో ఏడుగురిని అనకాపల్లి ఆసుపత్రికి, మరో తొమ్మిది మందిని అగనంపూడి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Anakapalli Road Accident
Anakapalli
Road Accident
Andhra Pradesh
Parawada
Lorry Accident
Lankelapalem
National Highway
Visakhapatnam

More Telugu News