Sasidhar: ఏపీపీఎస్‌సీ సభ్యుడుగా బాధ్యతలు స్వీకరించిన శశిధర్ .. వైసీపీ సానుభూతిపరుడంటూ విమర్శలు

Sasidhar Appointed as APPSC Member Sparks Controversy
  • నాడు అమరావతి రాజధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు
  • నాటి శశిధర్ వ్యాఖ్యలు నేడు సోషల్ మీడియాలో వైరల్
  • వైసీపీ వీరవిధేయుడిని ఎలా నియమించారంటూ మండిపాటు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) సభ్యుడిగా జేఎన్‌టీయూ – అనంతపురం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ సి. శశిధర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేయగా, ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించారు.

అయితే, శశిధర్ వైసీపీ విధేయుడనే విమర్శలు ఉన్నాయి. గతంలో రాజధాని అమరావతిని వ్యతిరేకించిన శశిధర్ దానిపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పట్లో జగన్ ప్రభుత్వానికి మద్దతుదారుడిగా వ్యవహరించారు.

"లక్షల కోట్లు వెచ్చించి నిర్మించే రాజధాని సరికాదు. ఒక సివిల్ ఇంజనీరింగ్ నిపుణుడిగా నేను అమరావతి ప్రాంతంలో పర్యటించాను. అక్కడ బేస్‌మెంట్‌కే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాలి. అమరావతి అభివృద్ధి చెందాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుంది. అధికార వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి" అని 2020 జనవరి 20న శశిధర్ వ్యాఖ్యానించారు.

అలా వ్యాఖ్యానించిన శశిధర్‌ను నేడు కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించడంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీపీ గౌతం సవాంగ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీనామా చేశారు. దాంతో ఈ స్థానంలో మాజీ ఐపీఎస్ అధికారిణి అనురాధను గత ఏడాది అక్టోబర్‌లో కూటమి ప్రభుత్వం నియమించింది.

అయితే సభ్యులుగా వైసీపీ హయాంలో నియమితులైన వారే ఇప్పటికీ కొనసాగుతుండగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా వైసీపీకి వీర విధేయుడుగా పేరున్న శశిధర్‌ను సభ్యుడుగా నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నియామకం ప్రభుత్వ, అధికార పార్టీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపేలా ఉంది. 
Sasidhar
APPSC
Andhra Pradesh Public Service Commission
JNTU Anantapur
Amaravati
YS Jagan Mohan Reddy
Gautam Sawang
Anuradha
AP Government

More Telugu News