Sri Ram: డ్రగ్స్ కేసు... హీరో శ్రీరామ్ కు రిమాండ్

Hero Sri Ram Remanded in Drugs Case
  • చెన్నైలో డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు శ్రీరామ్ అరెస్ట్
  • శ్రీరామ్ నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • జులై 7 వరకు రిమాండ్ విధించిన ఎగ్మోర్ కోర్టు
చెన్నైలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సుపరిచితుడైన హీరో శ్రీరామ్ అరెస్ట్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ కార్యనిర్వాహకుడితో సంబంధాలున్న ఈ డ్రగ్స్ రాకెట్‌లో శ్రీరామ్ పాత్ర ఉందని తేలడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 

తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు. ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి, తమదైన శైలిలో విచారించారు. ఈ విచారణలోనే శ్రీరామ్‌కు తాము డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శ్రీరామ్‌ను అరెస్ట్ చేసి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించి లోతుగా విచారించారు.

పోలీసుల విచారణ అనంతరం శ్రీరామ్‌ను చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం శ్రీరామ్‌కు జులై 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు.

ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు నుంగంబాక్కం పోలీసులు శ్రీరామ్‌ను కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. శ్రీరామ్‌ను విచారిస్తే డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కోలీవుడ్‌కు చెందిన మరికొందరు నటీనటుల పేర్లు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
Sri Ram
Drugs case
Chennai
Kollywood
ANNA DMK
Prasad
Tamil Nadu
Cocaine
Hero Sri Ram

More Telugu News